Union Budget 2024 :  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్-2024పై తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన కుర్చీని కాపాడుకునేందుకు పెట్టిన పద్దులా ఉందన్నారు. అది క్విడ్ ప్రో కో కు అర్థం చెప్పేలా కుర్చీ బచావో  బడ్జెట్‌లాగా ఉందన్నారు.  తెలంగాణపై కేంద్రం కక్ష సాధించినట్లుందని  బడ్జెట్‌ కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీపై చర్చిస్తామన్నారు. ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. కిషన్ రెడ్డినే తెలంగాణకు జరిగిన అన్యాయానికి బాధ్యత వహించాలన్నారు. 


పెదన్న పాత్ర పోషించాలని మోదీని అడిగినా ప్రయోజనం లేదు 


తెలంగాణకు ప్రధాని మోదీ వస్తే స్వాగతం పలికి పెద్దన్న పాత్ర పోషించమని అడిగానన్నారు. అయితే ఆయన పట్టించుకోకపోవడం సరి కాదన్నారు. పది సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని నిధులు అడిగామని రేవంత్ గుర్తు చేశారు.  ప్రధాని మోదీని స్వయగా  మూడుసార్లు కలిసి అడిగాననని..  కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మెరుగుపరుద్దామని ప్రధానితో చెప్పానన్నారు.   అయినా తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.  బడ్జెట్‌లో తెలంగాణ పదాన్ని నిషేధించారు. తెలంగాణ పదాన్ని పలకడానికి కేంద్ర ప్రభుత్వం ఇష్టపడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.   విభజన ప్రకారం ఏపీకి నిధులు ఇచ్చినప్పుడు.. తెలంగాణకు ఎందుకివ్వరని రేవంత్ ప్రశ్నించారు. 


కిషన్ రెడ్డి మంత్రి వర్గం నుంచి వైదొలగాలి ! 


గుజరాత్‌కు ఎలా నిధులు కేటాయించారో, మూసీకి అలా నిధులు కేటాయించామని ప్రధాని మోదీని అడిగాను. హైదరాబాద్‌కు నిధులు ఇస్తే దేశ ఎకానమికి ఉపయోగపడుతుందని మోదీకి వివరించాననని కానీ పట్టించుకోలేదన్నారు.  సబ్ కా సాత్ సబ్ కా వికాస్ స్లోగన్ బోగస్ అని బీజేపీ నిరూపించింది. వికసిత్ భారత్‌లో  తెలంగాణ ఎందుకుండదని ప్రశ్నించారు.  కిషన్ రెడ్డి బాధ్యత వహించి మోదీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. 


ఒక్క దానికీ నిధులు కేటాయించలేదు !                                                                  


ములుగు గిరిజన యూనివర్సిటీకి నిధులు కూడా కేటాయించలేదన్నారు.  ప్రతి రాష్ట్రంలో ఐఐఎం ఉంది. కానీ, తెలంగాణకు మాత్రమే ఐఐఎం ఇవ్వబోమని ఎలా చెబుతారని మండిపడ్డారు.  తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చకపోతే రాష్ట్రంలో బీజేపీకి నూకలు చెల్లినట్లేనని హెచ్చరించారు.   త్వరలోనే నిరసన కార్యక్రమానికి చెందిన కార్యాచరణను రూపొందిస్తాం. కాంగ్రెస్ చేపట్టే నిరసనలకు బీజేపీ ఎంపీలు, ఎంఐఎం కూడా సహకరించాలని పిలుపునిచ్చారు.  కిషన్ రెడ్డి మౌనం వదిలి రాష్ట్రం కోసం మాట్లాడాలన్నారు. బడ్జెట్ సవరించే అవకాశం ఉంది. బడ్జెట్ సవరించి మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, ఫార్మా విలేజ్ నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలి. బీజేపీ చేతకానీ తనం, బానిస మనస్తత్వం వల్ల తెలంగాణ అన్యాయం అవుతోందని ఆవేదన  వ్యక్తం చేశారు.