CM Chandrababu Sensational Comments On Viveka Murder Case: 'హు కిల్డ్ బాబాయ్' అనే ప్రశ్నకు త్వరలోనే జవాబు వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అసెంబ్లీలో ప్రకటించారు. వివేకా హత్య కేసు (Viveka Murder Case) అంశంపై ఆయన సభలో ప్రస్తావించారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో దౌర్జన్యాలు, బెదిరింపులు, అవమానాలు, హత్యా ఘటనలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధించే పరిస్థితి ఉండేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 'హు కిల్డ్ బాబాయ్.?' అనే ప్రశ్నకు జగన్ సమాధానం తేల్చలేకపోయారని.. ఇప్పుడు జవాబు వస్తుందని చెప్పారు. వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగిందని.. హత్య జరిగాక ఘటనా స్థలికి సీఐ వెళ్లారని చెప్పారు. సీబీఐకి విషయం తెలపడానికి సీఐ వెళ్లారని.. కానీ, వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. 'విచారణాధికారిపైనే కేసు పెడితే హైకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకునే పరిస్థితి వచ్చింది. వివేకా హత్య కేసు నిందితుల అరెస్టుకు వెళ్లిన సీబీఐ సిబ్బందే వెనక్కు తిరిగివచ్చారు. త్వరలోనే ప్రశ్నలన్నింటికీ జవాబు వస్తుంది.' అని చంద్రబాబు పేర్కొన్నారు.






'ఐదేళ్లలో దోపిడీ'


ప్రభుత్వ ఆదాయం ఐదేళ్లలో దోపిడీ జరిగిందని.. ఇసుక, మద్యం వంటివి రూ.లక్షల కోట్ల మేర దోపిడీ జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. అసమర్థ నిర్ణయాలతో అభివృద్ధి లేక ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమైందని.. 2019 నుంచి రాష్ట్ర వృద్ధి రేటు పడిపోయిందని అన్నారు. రాష్ట్రంలో రోడ్లను బాగు చేస్తామని స్పష్టం చేశారు. బుధవారం నుంచి అసెంబ్లీలో 3 శ్వేతపత్రాలు ప్రవేశపెడతామని చెప్పారు. 'రాజధాని నిర్మాణం పూర్తైతే దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల ప్రజా సంపద వచ్చి ఉండేది. ఈ రోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదు. 2020 - 21 నాటికి పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారు. టీడీపీ హయాంలో ప్రాజెక్ట్ 72 శాతం పూర్తైంది. కాంట్రాక్టర్లు, అధికారులను మార్చడం, రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం చేశారు. పోలవరాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోలవరంపై బడ్జెట్‌లో నిర్దిష్టమైన హామీ ఇచ్చారు. మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు' అని చంద్రబాబు పేర్కొన్నారు.


'రాజధాని కలను చంపేశారు'


వైసీపీ ప్రభుత్వం అమరావతిని సర్వనాశనం చేసిందని.. ఏపీ ప్రజల రాజధాని కలను చంపేసిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అమరావతికి బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు కేటాయించడంతో.. అమరావతికి మళ్లీ మంచి రోజులు వచ్చాయనే ఆశ అందరిలోనూ కనిపిస్తుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొందని.. అందుకే 2 నెలల టైం తీసుకుని బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచనకు వచ్చినట్లు చంద్రబాబు చెప్పారు.


Also Read: AP Assembly Sessions: ఆ 2 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం - ఈసారి ప్రత్యేకత ఏంటో తెలుసా?