Chhattisgarh Maoist Attack:
పక్కా ప్లాన్‌తో..
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టుల దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తమ ఉనికిని చాటుకునేందుకు మరోసారి నక్సలైట్‌లు దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందు 11 మంది ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పినా..ఆ తరవాత మృతుల సంఖ్య పెరిగింది. వీరిలో 10 మంది పోలీసులు. మరొకరు డ్రైవర్. దాడి జరిగిన తీరు చూస్తుంటేనే తెలుస్తోంది...బతికే అవకాశమే లేకుండా పక్కా ప్లాన్‌తో చేశారని. ప్రస్తుతం అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం నక్సలైట్‌లు పోలీసులపై దాడి చేసేందుకు భారీ బాంబునే వినియోగించారు. 50 కిలోల IEDని వాడారు. ఆ బాంబు ధాటి ఎంతగా ఉందో...దాడి జరిగిన ప్రాంతాన్ని చూస్తేనే అర్థమవుతోంది. భారీగా గుంత ఏర్పడింది. District Reserve Guard (DRG) పోలీసులు రెంట్‌కి తీసుకున్న వ్యాన్‌లో ప్రయాణిస్తున్నారు. బాంబు దాడిని తట్టుకునే సామర్థ్యం లేని సాదాసీదా వ్యాన్ అది. అందుకే డ్యామేజ్ ఆ స్థాయిలో జరిగింది. ఆ బాంబు పేలుడు ధాటికి వ్యాన్ కనీసం 20 అడుగుల ఎత్తు వరకూ ఎగిరి పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భారీ మొత్తంలో ఎక్స్‌ప్లోజివ్స్ వినియోగించడం వల్లే వ్యాన్ తునాతునకలైందని చెబుతున్నారు. సాధారణంగా దాడుల్లో వాడే క్వాంటిటీకి 10 రెట్లు ఎక్కువగా IED వాడినట్టు అంచనా. యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ చేసి వస్తుండగా దారి మధ్యలో ఈ అటాక్ జరిగింది. ఇప్పటికే స్పెషల్ సెక్యూరీట ఆఫీసర్‌లు ఘటనా స్థలానికి చేరుకుని మావోయిస్ట్‌ల కోసం గాలింపు మొదలు పెట్టారు. కానీ...అడవిలోకి వెళ్లి వాళ్లు అదృశ్యమైనట్టు అధికారులు తెలిపారు.
ప్రతీకార దాడి..!
నిజానికి ఛత్తీస్‌గఢ్‌లో చాలా రోజులుగా కూంబిగ్ ఆపరేషన్ జరుగుతోంది. మావోయిస్ట్‌లను ఏ మాత్రం సహించడం లేదు భద్రతా బలగాలు. ఢిపెన్స్ హెలికాప్టర్లు, డ్రోన్స్‌తో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు మావోయిస్టు కీలక నేతలు ఎన్ కౌంటర్‌లో మరణించారు. దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు నక్సలైట్లు ఈ దాడికి పాల్పడినట్టు భావిస్తున్నారు. అటు ఎన్‌కౌంటర్‌లు చేస్తూనే జనజీవన స్రవంతిలో కలిసిపోయే మావోలకు రక్షణ కల్పిస్తామని భరోసా ఇస్తోంది ప్రభుత్వం. పునరావాస చట్టం కింద వాళ్లకు ఆశ్రయం కల్పించేందుకు అంగీకరిస్తోంది. ఈ కారణంగా ఏటా 400 మంది మావోలు లొంగిపోతున్నట్టు అంచనా. ప్రస్తుతానికి చాలా మంది కీలక నేతలు ఛత్తీస్‌గఢ్ వదిలి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అడవుల్లోకి మకాం మార్చినట్టు భావిస్తున్నారు. ఈ దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పోలీసుల సేవల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని అన్నారు.
"ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో పోలీసులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అమరులందరికీ నా నివాళి. వాళ్ల త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను"
- ప్రధాని నరేంద్ర మోదీ