Wagh Nakh:


బ్రిటన్ మ్యూజియంలో ఆయుధం..


ఛత్రపతి శివాజీ మహరాజ్ 1659లో వినియోగించిన ఆయుధం "Wagh Nakh"ని యూకే నుంచి ఇండియాకి రానుంది. పులిగోళ్లను పోలి ఉండే ఈ ఆయుధాన్ని 1659లో అఫ్జల్ ఖాన్‌ని చంపేందుకు వాడారు శివాజీ. ప్రస్తుతం ఇది లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది. త్వరలోనే యూకే భారత్‌కి ఈ ఆయుధాన్ని తిరిగి ఇవ్వనుంది. G20 సదస్సు కోసం యూకే ప్రధాని రిషి సునాక్ భారత్‌కి వచ్చిన క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆసక్తికర ట్వీట్ చేసింది. త్వరలోనే ఈ ఆయుధం భారత్‌కి రానుందని వెల్లడించింది. శివాజీ ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఈ ఆయుధాన్ని ఆయన వారసులు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫీసర్ జేమ్స్ గ్రాంట్ డఫ్‌కి ఇచ్చారు. ఇండియాలో సర్వీస్ ముగిసిన తరవాత జేమ్స్ గ్రాంట్ తనతో పాటు ఆ ఆయుధాన్ని బ్రిటన్‌కి తీసుకెళ్లారు. ఆ తరవాత డఫ్ వారసులు దాన్ని మ్యూజియంకి అందించారు. అప్పటి నుంచి అక్కడే భద్రపరిచారు. ఈ ఆయుధం వెనక్కి తీసుకొచ్చేందుకు మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంతివార్ గట్టి ప్రయత్నమే చేశారు. త్వరలోనే ఆయన Victoria and Albert Museumతో అంగీకార ఒప్పందం కుదుర్చుకోనున్నారు. దానిపై సంతకం చేయనున్నారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4వ తేదీల మధ్యలో సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ కల్చర్ అండ్ డైరెక్టర్ ప్రతినిధులు, ఆర్కియాలజీ, మ్యూజియం డిపార్ట్‌మెంట్ ప్రతినిధులు విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంని సందర్శించనున్నారు. ఈ ఆరు రోజుల పర్యటనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే రూ.50 లక్షల నిధులు కేటాయించారు. 


"ఛత్రపతి శివాజీ ఆయుధమైన వఘ్ నఖ్ అమూల్యమైంది. మహారాష్ట్ర ప్రజలకు ఈ ఆయుధానికి ఎంతో అనుబంధం ఉంది. ఇది తిరిగి భారత్‌కి వస్తుండడం చాలా సంతోషం. ఈ ఆయుధాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉంది. అందుకే...రూ.50 లక్షల నిధులు కేటాయించాం. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిందే ఇందుకు ఆమోదం తెలిపారు"


- మహారాష్ట్ర ప్రభుత్వం