పంజాబ్ 16వ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ బన్‌వరీలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. చన్నీతో పాటు డిప్యూటీ సీఎంలుగా సుఖ్‌జిందర్ రంధావా, ఓం ప్రకాశ్ సోనితుక్ ప్రమాణస్వీకారం చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కెప్టెన్ అమరీందర్ సింగ్ గైర్హాజరయ్యారు.
తొలి దళిత సీఎం..
చరణ్‌జిత్ సింగ్.. పంజాబ్ తొలి దళిత సీఎంగా రికార్డులకెక్కారు. ఓం ప్రకాష్.. హిందూ వర్గానికి చెందినవారు కాగా రంధావా జాట్ సామాజిక వర్గానికి చెందిన నేత.
సిద్ధూకి ఆప్తుడు..
సిద్ధూకు అత్యంత ఆప్తుడిగా చన్నీకి పేరుంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఆరు నెలలు మాత్రమే ఉండగా ముఖ్యమంత్రిని మార్చాల్సి వచ్చింది కాంగ్రెస్.
- చామ్‌కౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
- 2015-2016 మధ్య అసెంబ్లీలో కాంగ్రెస్ తరఫున ప్రతిపక్ష నాయకుడిగా వ్యవవహరించారు.
- అమరీందర్ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
మోదీ శుభాకాంక్షలు..
పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చరణ‌్‌జిత్ సింగ్ చన్నీకి నా శుభాకాంక్షలు. పంజాబ్ ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తాం.
నరేంద్ర మోదీ, ప్రధాని