చరణ్‌జిత్ సింగ్ చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన పేరును కాంగ్రెస్ పార్టీ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. కొత్త సీఎల్పీ నాయకుడిని ఎన్నుకునేందుకు ఆదివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పంజాబ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి హరీశ్ రావత్, ఏఐసీసీ నియమించిన పరిశీలకులు అజయ్ మాకెన్, హరీశ్ ఛౌదురి ఎమ్మెల్యేలతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం అధిష్ఠానంతో చర్చించి చరణ్‌జిత్ సింగ్ పేరును హరీశ్ రావత్ ప్రకటించారు.
మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయన వైపే మొగ్గు చూపారని హరీశ్ రావత్ వెల్లడించారు. అంతకుముందు సుఖ్‌జిందర్ సింగ్ పేరు వినిపించినప్పటికీ చరణ్‌జిత్ సింగ్ చన్నీ పేరు ఖరారైంది.
- చామ్‌కౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
- 2015-2016 మధ్య అసెంబ్లీలో కాంగ్రెస్ తరఫున ప్రతిపక్ష నాయకుడిగా వ్యవవహరించారు.
- అమరీందర్ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
అమరీందర్ రాజీనామా..
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు పెద్ద షాక్ అని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటివరకు అంతర్గత కలహాలు ఉన్నా సద్దుకుపోయిన అమరీందర్.. ఎట్టకేలకు రాజీనామా చేశారు. అయితే తదుపరి సీఎం పదవికి రేసులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ సునీల్ జాఖర్ వైపు పార్టీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన అమరీందర్ సింగ్.. పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన స్ఖానంలో సీఎం పదవికి సిద్ధూను ఎంపిక చేస్తే అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఆయనకు ఆ అర్హత లేదని వ్యాఖ్యానించారు.
Also Read: UP Election: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ సమరంలో ప్రియాంక గాంధీ.. సీఎం అభ్యర్థిగా ఫైనల్!