Chandrayaan 3 Landing Anniversary: 2023 ఆగస్టు 23వ తేదీన భారత్ చరిత్ర సృష్టించింది. మరే దేశానికి సాధ్యం కాని అరుదైన రికార్డు సాధించింది. చంద్రుడిపై దక్షిణ ధ్రువంపైన త్రివర్ణ పతాకాన్ని ఎగరేసింది. సాఫ్ట్ ల్యాండింగ్‌తో అన్ని దేశాల చూపుని మనవైపు తిప్పింది. సౌత్‌పోల్‌పై ల్యాండ్‌ అయిన తొలి దేశంగా నిలిచింది. ఈ ఘనతకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఈ తేదీని  National Space Day గా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ఇవాళ్టితో చంద్రయాన్ -3 సక్సెస్‌కి ఏడాది పూర్తైన సందర్భంగా మరోసారి ఇస్రోపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మరోసారి ఆ చరిత్రను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 6 గంటలకు విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్‌ అయింది. ప్రజ్ఞాన్ రోవర్‌ దిగిన ప్రాంతానికి భారత్ శివశక్తి పాయింట్ అనే పేరు పెట్టింది.


చంద్రుడి కక్ష్య నుంచి విడత వారీగా కిందకు దిగుతూ విక్రమ్ ల్యాండర్‌ ఆ పాయింట్ వద్ద ల్యాండ్ అయింది. గుండ్రంగా పరిభ్రమించిన ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలానికి చేరుకున్న సమయానికి వర్టికల్‌ దశకు చేరుకుంది. ల్యాండ్‌ అయిన సమయంలోనే తొలి ఫొటోలను పంపించింది విక్రమ్ ల్యాండర్. అప్పట్లో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి చంద్రయాన్ -3 నుంచి ఏదో ఓ అప్‌డేట్ వస్తూనే ఉంది. 






చంద్రయాన్ -3 వార్షికోత్సవాన్ని ఇస్రో ఘనంగా జరుపుకుంటోంది. ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. భారత దేశ అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అయితే..వార్షికోత్సవం సందర్భంగా ఇస్రో చంద్రయాన్ 3 కొత్త ఫొటోలు షేర్ చేసింది. రోవర్‌ అక్కడ అడుగు పెట్టినప్పటి ఫొటోలు విడుదల చేసింది. ల్యాండర్ ఇమేజర్, రోవర్ ఇమేజర్‌ ఈ ఫొటోలు తీసినట్టు ఇస్రో వెల్లడించింది. India's Space Saga పేరిట ఈ ఏడాది థీమ్‌తో నేషనల్ స్పేస్‌ డే జరుపుకుంటోంది భారత్. మరెన్నో విజయాలకు ఇది నాంది పలకాలని ఆకాంక్షిస్తోంది. ఇప్పటికే ఈ ఘనతతో ఇస్రో పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రాజెక్ట్‌లపైనా అంచనాలు పెరిగిపోయాయి. 


"భారత అంతరిక్ష రంగంలో విధానాల సంస్కరణలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక చొరవ చూపించారు. ఆయన ప్రోత్సాహం వల్లే ఇదంతా సాధ్యమైంది"


- ఎస్‌ సోమనాథ్, ఇస్రో ఛైర్మన్


Also Read: Nepal: నేపాల్‌లో ఘోర ప్రమాదం, 40 మంది భారతీయులతో వెళ్తున్న బస్ నదిలో బోల్తా - 14 మంది మృతి?