Chandrababu Naidu Comments on Kodali Nani: తెలుగు దేశం - జనసేన పార్టీ కలిశాయని తెలియగానే వైసీపీ నేతల్లో దడ మొదలైందని చంద్రబాబు అన్నారు. అప్పటి నుంచి ఏ సర్వే చూసినా టీడీపీ-జనసేన కూటమే గెలుస్తుందని తేల్చుతున్నాయని అన్నారు. ఆ విషయం తెలిసి జగన్ కు నిద్ర పట్టడం లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అందుకే 90 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చుతున్నారని అన్నారు. రాజకీయాల్లో ఎక్కడా తాను ట్రాన్స్‌ఫర్లు చూడలేదని.. జగన్ మాత్రం ఇక్కడి చెత్త అక్కడ.. అక్కడి చెత్త ఇక్కడికి మార్చుతున్నారని అన్నారు. ఒకచోట చెల్లని వారు మరో చోట ఎలా పనికి వస్తారని చంద్రబాబు నిలదీశారు. మరో 83 రోజులే ఈ ప్రభుత్వానికి సమయం ఉందని, ఆ తర్వాత వైసీపీని భూస్థాపితం చేసేయాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు రా.. కదలిరా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై కూడా చంద్రబాబు సెటైర్లు వేశారు. ఆయనది నోరా డ్రైనేజా అని ఎద్దేవా చేశారు. ఎంత ఫినాయిల్ వేసి కడిగినా అతని నోరు మురికి కాలువే అని ఎగతాళి చేశారు. నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతుంటాడని.. ఎంత బూతులు మాట్లాడితే అంత పెద్ద నాయకులు అవుతారని అనుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. తన వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకొని.. నాకే పాఠాలు చెప్తారా? చూపిస్తా అంటూ చంద్రబాబు మాట్లాడారు.
సీఎం పదవికి జగన్ అనర్హుడు
‘‘ముఖ్యమంత్రి పదవికి అర్హతలేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. బూతు శ్రీ అయిన వ్యక్తికి ఎమ్మెల్యే పదవి...బూతురత్నకు ఎంపీ పదవి.. బూతుసామ్రాట్ అయితే మంత్రి పదవి... ఇదీ ఈనాడు రాష్ట్రంలో సాగుతున్న రాజకీయం. ఎంపీలంటే పార్లమెంట్ లో మాట్లాడి కేంద్రాన్ని మెప్పించి రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురావాలి. కానీ ఇక్కడున్న సైకో అవన్నీ అవసరం లేదంటున్నాడు.. చంద్రబాబుని తిట్టావా.. పవన్ కల్యాణ్ ను తిట్టావా.. లోకేశ్ ను తిట్టావా.. అవేవీ చేయలేదు కాబట్టి..నీకు టిక్కెట్ ఇవ్వను అన్నాడు.. ఇక్కడున్న ఎంపీని. అదీ వీళ్ల రాజకీయం. బీసీ ఎంపీ కర్నూల్ నుంచి మాట్లాడుతున్నాడు... ఐదేళ్లలో ముఖ్యమంత్రినే కలవలేదు.. అపాయింట్ మెంటే ఇవ్వలేదు అంటున్నాడు. బలహీనవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ ఈ ముఖ్యమంత్రి ఎంత అహంభావో.. అహంకారో చెప్పకనే చెప్పాడు. మరొకడేమో.. సంక్రాంతి సంబరాలని చెప్పి, పేదలకు ఇచ్చే పింఛన్ల సొమ్ముని నొక్కేసి డ్యాన్సులు వేస్తున్నాడు’’
జగన్ వస్తే అమరావతి-పోలవరం ఆగిపోతాయని నాడే చెప్పా
‘‘ఇంతకుముందే చెప్పాను.. జగన్మోహన్ రెడ్డి వస్తే పోలవరం ఆగిపోతుంది.. అమరావతి నిలిచిపోతుందని. పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. అమరావతిని చెరబట్టాడు. దీనివల్ల రాష్ట్ర సంపద నాశనమైంది. అన్ని అరిష్టాలకు కారణం.. ఈముఖ్యమంత్రి.. వైసీపీ నాయకులు చేసిన తప్పుడు పనులే’’