Chandrababu Naidu DK Shivakumar Meet: ఏపీ టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఒకరికొకరు అనూహ్యంగా ఎదురు పడ్డారు. బెంగళూరు ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. చంద్రబాబు బెంగళూరు పర్యటన నేడు (డిసెంబర్ 28) జరిగింది. అది ముగించుకొని కుప్పంకు తిరుగు ప్రయాణం అయ్యేందుకు చంద్రబాబు బెంగళూరులోని ఓ ఎయిర్ పోర్టుకు వచ్చారు. అదే సమయంలో డీకే శివకుమార్ కూడా మరో ప్రాంతానికి ప్రత్యేక విమానంలో వెళ్లేందుకు అక్కడికి రావడంతో ఇద్దరు నేతలు ఎదురుపడ్డారు. ఒకరినొకరు పలకరించుకున్నారు. వెంటనే ఇద్దరూ తమ పర్సనల్ సెక్యూరిటీని దూరంగా ఉండమని సైగ చేసి కాస్త పక్కకి వెళ్లి సీక్రెట్ విషయాలు మాట్లాడుకున్నారు. వీరు ఎదురుపడగానే పక్కకు వెళ్లి ఇద్దరే సీక్రెట్ గా మాట్లాడుకోవడం ఆసక్తిని కలిగించింది.


కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు త్రిలోక్‌ను పరామర్శించడం కోసం చంద్రబాబు బెంగళూరు వెళ్లారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ సమయంలో కుప్పంలో ఆందోళన చేస్తున్న సమయంలో త్రిలోక్ ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం బెంగళూరులోని తన నివాసంలో త్రిలోక్ ఉంటున్నారు. ఈ క్రమంలో త్రిలోక్‌ను పరామర్శించేందుకు చంద్రబాబు వెళ్లారు. తీవ్ర అనారోగ్యానికి గురైన త్రిలోక్ ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి బెంగళూరు టీడీపీ ఫోరం సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. అది ముగించుకొని కుప్పంకు బయలుదేరేందుకు బెంగళూరు హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టుకు చంద్రబాబు చేరుకోగా.. అక్కడ డీకే శివకుమార్ ఎదురయ్యారు.