Chandrababu and Pawan Kalyan In Haryana : హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సీఎంగా  బాధ్యతలు చేపట్టడం రెండో సారి.  పంచకులలో  జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణం చేయించారు. హర్యానా ఎన్నికల్లో   బీజేపీ 90 స్థానాల‌కు గాను 48 స్థానాల్లో గెలుపొంది సాధారణ మెజార్టీని సాధించింది. గతంలో మనోహర్ లాల్ ఖట్టర్ సీఎంగా ఉడేవారు. ఆయన స్థానంలో సైనీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల్లోనే హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. సైనీ నేతృత్వంలోని బీజేపీ ఎన్నికలకు వెళ్లింది. మూడోసారి విజయం సాధించింది. 



ఎన్డీఏ పక్ష నేతలంతా హాజరు 


నాయస్ సింగ్ సైని ప్రమాణస్వీకారోత్సవానికి  ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో  పాటు  ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాలకు చెందిన 18 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు. దేశంలోని ప్రముఖ నేతలంతా ఒకే చోట చేరడంతో పంచకులలో సందడి నెలకొంది. ఏపీ నుంచి  ఎన్డీఏలో కీలక నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్డీఏలో భాగంగా ఉన్నామని ఈ ఈ విజయోత్సవంలో పాల్గొనడానికి వచ్చామని అక్కడి మడియాకు పవన్ కల్యాణ్ తెలిపారు. 



చంద్రబాబుకు అత్యధిక ప్రాధాన్యం


ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలక పార్టీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యధిక  ప్రాధాన్యం లభించింది. ఆయనకు వేదికపై అమిత్ షా, జేపీ నడ్డాల మధ్యలో సీటు ఏర్పాటు చేశారు. ఇలా సీటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా వారు చంద్రబాబుకు ఎంత విలువ ఇస్తున్నామో చెప్పినట్లయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 



ఎన్డీఏ గ్రూపు ఫోటోలో మోదీ పక్కన చంద్రబాబు


ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ఎన్డీఏ పార్టీలన్నీ గ్రూపు ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రధాని మోదీ సహా కీలక నేతలందరూ ఈ ఫోటో కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ కూడా చంద్రబాబుకు ప్రదాని మోదీ పక్కన స్పేస్ రిజర్వ్ చేశారు. ఈ పరిణామాలన్నీ ఎన్డీఏలో టీడీపీకి లభిస్తున్న ప్రాధాన్యతను గుర్తు చేస్తున్నాయని అంటున్నారు.  



ఎన్డీఏ సమావేశంలో కీలక అంశాలపై చర్చలు


ప్రమాణ స్వీకారం తర్వాత ఎన్డీఏ పార్టీలన్నీ సమావేశమయ్యాయి. ఇందులో పార్టీల మధ్య సమన్వయం కోసం ఏం చేయాలన్నదానిపై చర్చించారు. అలాగే కొన్ని విధానపరమైన నిర్ణయాలపైనా చర్చించినట్లగా తెలుస్తోంది.