Chandigarh University Protest: పంజాబ్ మొహాలీలోని చండీగఢ్ యూనివర్సిటీ విద్యార్థినుల ఆందోళనలతో దద్దరిల్లింది. క్యాంపస్‌లోని హాస్టల్‌లో విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలు ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో దుమారం చెలరేగింది. యూనివర్శిటీ హాస్టల్‌లోనే ఉంటోన్న ఓ యువతి ఈ వీడియోలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన కారణంగా కొంతమంది యువతులు ఆత్మహత్యకు యత్నించినట్లు నిరసన చేస్తోన్న విద్యార్థినులు ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వీడియో చిత్రీకరించినట్లు భావిస్తోన్న యువతిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ జరిగింది
యూనివర్సిటీ హాస్టల్‌లో తోటి విద్యార్థినిలు స్నానం చేస్తున్న వీడియోలను తీసిన ఓ విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్‌కు వాటిని పంపింది. మొత్తం 60 మంది అమ్మాయిలు స్నానం చేస్తున్న వీడియోలను అతను ఇంటర్నెట్‌లో అప్లోడ్ చేశాడు. ఆ వీడియోలు పోర్న్ సైట్‌లో కనిపించడంతో యూనివర్సిటీ విద్యార్థినిలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అవమాన భారంతో 8 మంది విద్యార్థినిలు ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం.
ఆందోళన
ఈ ఘటనపై చండీగఢ్ యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఆందోళనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చండీగఢ్ యూనివర్సిటీ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. పోలీసుల వాహనాలపై విద్యార్థులు రాళ్లు రువ్వారు.
ప్రభుత్వం సీరియస్
ఈ ఘటనపై పంజాబ్ విద్యా మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ స్పందించారు. విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దోషులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అలాంటిదేం లేదు
ఈ ఘటన గురించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. విద్యార్థులు చెబుతున్నట్లు ఎవరూ ఆత్మహత్యకు యత్నించలేదని మొహాలీ ఎస్‌ఎస్‌పీ తెలిపారు.
Also Read: Trains Cancelled: రైలు ప్రయాణికులకు అలర్ట్, ఆ రూట్లలో వెళ్లే రైళ్లు రద్దు!