Central Government Fuel Policy Backlash: పర్యావరణ పరిరక్షణ, ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన E20 పెట్రోల్ విధానం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళానికి, వినియోగదారుల్లో అసంతృప్తికి దారితీస్తోంది. ఒక మంచి ఆశయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు, క్షేత్రస్థాయిలో సరైన అవగాహన కల్పించకపోవడం వల్ల ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి పెద్ద పొలిటికల్ మైలేజ్ నష్టాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ఇంధన వినియోగంపై గత కొంతకాలంగా సోషల్ మీడియా , వాహనదారుల్లో జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కేంద్రం పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది.
ఇంజన్లు పాడైపోతున్ననాయన్న ప్రచారం
ఈ E20 పెట్రోల్ వినియోగం వల్ల వాహనాలు, ముఖ్యంగా పాత మోడల్ టూ వీలర్లు , కార్ల ఇంజన్లు త్వరగా పాడైపోతున్నాయనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇథనాల్ మిశ్రమం వల్ల ఇంజన్లలో తుప్పు పట్టడం , మైలేజ్ గణనీయంగా తగ్గిపోవడం, లాంటి సాంకేతిక సమస్యలు వస్తున్నాయని వాహనదారులు వాపోతున్నారు. వీటన్నింటికీ తోడు, E20 ఇంధనం వల్ల ఇంజన్ ఫెయిల్యూర్ అయితే మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్‌లను తిరస్కరిస్తున్నాయనే సరికొత్త ప్రచారం ప్రజల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ఇలాంటి సున్నితమైన అంశాలపై కేంద్ర రవాణా మరియు చమురు శాఖలు పక్కా వివరణ ఇవ్వకపోవడం ఈ గందరగోళాన్ని మరింత పెంచింది.
నితిన్ గడ్కరీ కుమారుల వ్యాపారం అంటూ ప్రచారం
ఈ వ్యూహాత్మక లోపం కాస్తా ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇథనాల్ ఇంధన వినియోగాన్ని విపరీతంగా ప్రమోట్ చేస్తుండటం, ఈ రంగంలో ఆయన కుటుంబ సభ్యులకు లే వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయనే ఒక బలమైన ప్రచారం ప్రతిపక్షాలు , సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇది కేవలం దేశ ప్రయోజనాల కోసం కాకుండా, కొందరి వ్యక్తిగత వ్యాపార సామ్రాజ్యాల విస్తరణ కోసమే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మరీ ముందే అమలు చేయిస్తున్నారనే భావన సాధారణ ఓటర్లలో పెరగుతోంది.
ప్రజలకు అవగాహన కల్పించకపోవడం వల్లే సమస్యలు
సాధారణంగా ఏదైనా ఒక పెద్ద విధానపరమైన మార్పును ప్రజల్లోకి తీసుకువచ్చేటప్పుడు ప్రభుత్వాలు ముందుగా విస్తృతమైన అవగాహన సదస్సులు నిర్వహించడం, కంపెనీల ద్వారా E20 అనుకూల ఇంజన్లను మార్కెట్లోకి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడం వంటి చర్యలు తీసుకుంటాయి. కానీ ఇక్కడ కేంద్రం దేశంలో ముడి చమురు కొరత వేధిస్తోందనే తొందరపాటుతో, వాహన రంగాన్ని మానసికంగా , సాంకేతికంగా సంసిద్ధం చేయకుండానే దేశవ్యాప్తంగా బ్లెండెడ్ పెట్రోల్ సరఫరాను ముమ్మరం చేసింది. దీనివల్ల పాత వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల్లో పెరుగుతున్న ఈ అసంతృప్తి రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతగా మారే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెట్రోల్ ధరలు ఇప్పటికే సామాన్యుడికి భారంగా మారిన తరుణంలో, నాణ్యత లేని ఇంధనం వల్ల వాహనాలు పాడవుతున్నాయనే ఆగ్రహం మిడిల్ క్లాస్ ఓటర్లలో తీవ్రమవుతోంది.
కేంద్రం గట్టి భరోసా ఇవ్వాలి!
ఒకవైపు హరిత ఇంధనం అంటూ అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కించుకుంటున్నా, దేశీయంగా ఓటర్ల నుంచి వస్తున్న ఈ నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ కచ్చితంగా అధికార పీఠాన్ని కలవరపరిచే అంశమే. కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లపై వస్తున్న అపోహలను తొలగిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయడం, పాత వాహనదారులకు ఇంజన్ ప్రొటెక్షన్ కిట్స్ లేదా ప్రత్యామ్నాయ ఇంధన సదుపాయం కల్పించడం, మరియు ఈ వ్యాపార లావాదేవీలపై వస్తున్న ఆరోపణలను పారదర్శకంగా తిప్పికొట్టడం ద్వారానే డ్యామేజ్ కంట్రోల్ సాధ్యమవుతుంది. లేనిపక్షంలో, పర్యావరణ హితం కోసం తెచ్చిన 'ఇథనాల్' రాజకీయం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద మైనస్‌గా మారే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
