E20 Petrol Price: దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో E20 పెట్రోల్ సరఫరా లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా అమలు చేస్తోంది. అయితే ప్రతి లీటర్ పెట్రోల్‌లో ఐదో వంతు ఇథనాల్ ఉంటే, పెట్రోల్ ధర ఎందుకు తగ్గడం లేదనే సందేహం చాలా మందిలో ఉంది. ఈ ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టమైన వివరణ ఇచ్చింది.

Continues below advertisement

మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 'తరచుగా అడిగే ప్రశ్నలు' (FAQ)లో... E20 పెట్రోల్ లక్ష్యం ధర తగ్గించడం కాదని, దేశాన్ని దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడకుండా చేయడం & అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల ప్రభావాన్ని వినియోగదారులపై తగ్గించడం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.

ప్రస్తుతం ప్రభుత్వం ఇథనాల్‌ను రైతులకు గిట్టుబాటు ధర లభించేలా కొనుగోలు చేస్తోందని తెలిపింది. మొక్కజొన్న ఆధారిత ఇథనాల్‌ను లీటరుకు సుమారు రూ.71.86 ధరకు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. దీనికి GST, రవాణా, నిల్వ & డిపో నిర్వహణ ఖర్చులు అదనంగా ఉంటాయని వివరించింది.

Continues below advertisement

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో మారుతి ఇన్విక్టో ఆన్-రోడ్ ధర ఎంత? వేరియంట్లు, మైలేజ్ ఫీచర్ల పూర్తి వివరాలు!

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు సుమారు 70 డాలర్ల వద్ద ఉన్నప్పుడు E20 పెట్రోల్ తయారీ ఖర్చు సాధారణ పెట్రోల్ కంటే ఎక్కువగానే ఉంటుందని కేంద్రం తెలిపింది. అయితే ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120 నుంచి 130 డాలర్లకు చేరితే పరిస్థితి పూర్తిగా మారుతుందని, అప్పుడు ఇథనాల్ మిశ్రమ ఇంధనం మరింత ఆర్థికంగా ప్రయోజనకరంగా మారుతుందని పేర్కొంది.

కాబట్టి E20 పెట్రోల్ ధర E10 లేదా సాధారణ పెట్రోల్ కంటే తక్కువగా ఎందుకు లేదనే దానికంటే, ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగినా భారతదేశ వినియోగదారులను ఎలా రక్షించగలిగిందన్నదే అసలు ప్రశ్న అని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.

ప్రస్తుతం దేశంలో విక్రయించే ప్రతి లీటర్ పెట్రోల్‌లో దాదాపు 20 శాతం దేశీయంగా ఉత్పత్తి చేసిన ఇథనాల్ ఉంటుంది. ఈ ఇథనాల్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లోని బ్రెంట్ క్రూడ్ ధరలు, భౌగోళిక ఉద్రిక్తతలు లేదా రవాణా అంతరాయాలతో ప్రతిరోజూ మారదని కేంద్రం తెలిపింది. దీంతో ఇంధన ధరల్లో స్థిరత్వం కొనసాగుతోందని పేర్కొంది.

ఇది కూడా చదవండి: ఆడవాళ్లు కాళ్లను సులభంగా నేలపై ఉంచగల టూవీలర్లు - తక్కువ సీట్ హైట్‌ ఉన్న 10 ఎలక్ట్రిక్ స్కూటర్లు

ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గడంతో పాటు విదేశీ మారక ద్రవ్య వ్యయం కూడా గణనీయంగా తగ్గిందని ప్రభుత్వం వెల్లడించింది. రైతులకు అదనపు ఆదాయం లభించడంతో పాటు దేశ ఇంధన భద్రత కూడా బలోపేతమైందని వివరించింది.

కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ కార్యక్రమం ద్వారా రూ.1.97 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేశారు. అలాగే 316 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతిని భర్తీ చేయడంతో పాటు సుమారు 952 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించారు. రైతులకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా ఆదాయం చేరిందని తెలిపింది.

ఇంధన ధరల పోలికను కూడా కేంద్రం వెల్లడించింది. జూన్ 2022 నుంచి జూన్ 2026 వరకు ఢిల్లీలో పెట్రోల్ ధర కేవలం 5.58 శాతం మాత్రమే పెరిగిందని తెలిపింది. ఇదే కాలంలో పాకిస్థాన్‌లో 39.77 శాతం, శ్రీలంకలో 36.66 శాతం, నేపాల్‌లో 20.35 శాతం, బంగ్లాదేశ్‌లో 42.69 శాతం పెరిగినట్లు పేర్కొంది. డీజిల్ ధరలు కూడా పొరుగు దేశాలతో పోలిస్తే భారత్‌లో చాలా తక్కువగా పెరిగాయని వెల్లడించింది.

ఇటీవల పశ్చిమ ఆసియా సంక్షోభం సమయంలో కూడా భారత్‌లో ఇంధన ధరల పెరుగుదల పరిమితంగానే ఉందని కేంద్రం తెలిపింది. మార్చి నుంచి జూన్ 2026 మధ్య ఢిల్లీలో పెట్రోల్ ధర 7.76 శాతం మాత్రమే పెరిగిందని, ఇదే సమయంలో పాకిస్థాన్‌, శ్రీలంక‌, నేపాల్‌ & బంగ్లాదేశ్‌లలో ధరలు గణనీయంగా పెరిగాయని వెల్లడించింది.

E20 పెట్రోల్‌ వల్ల వాహనాల ఇంజిన్‌లు దెబ్బతింటాయనే ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఖండించిన విషయం తెలిసిందే. మైలేజ్ 3-5% వరకు తగ్గే అవకాశం ఉందని మాత్రం సర్కారు ఒప్పుకుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.