తెలంగాణ సీఎం కేసీఆర్ విద్యుత్ సంస్కరణలపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర విద్యుత్ శాఖ(Power Ministry) స్పందించింది. విద్యుత్ సంస్కరణల అమలుపై రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి చేయడంలేదని కేంద్ర మంత్రి ఆర్.కె.సింగ్(RK Singh) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్(CM Kcr) ఆరోపణలు అవాస్తవాలన్నారు. సీఎం హోదాలో ఉన్న ఓ వ్యక్తి ప్రజల్లో అపోహలు సృష్టించడం సరికాదన్నారు. వ్యవసాయ బోర్లు, బావుల మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టాలని రాష్ట్రాలను కేంద్రం బలవంతం చేయట్లేదని పేర్కొన్నారు. దేశంలో పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగంపై ఏ రాష్ట్రంపైనా ఒత్తిడి చేయలేదన్నారు. సోలార్ విద్యుత్(Solar Energy) కొనుగోలుకు రాష్ట్రాలను బలవంతం చేయట్లేదని కేంద్ర మంత్రి ఆర్.కె.సింగ్ అన్నారు. దేశంలో విద్యుత్ కొనుగోలు(Power Purchage) అన్నీ ఓపెన్ బిడ్ ల ద్వారా నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రాలు విద్యుత్ వినియోగాల అనుగుణంగా కొనుగోలు చేస్తున్నారన్నారు. ఇందులో ఎటువంటి దాపరికం లేదన్నారు. బిడ్‌లను రాష్ట్రాలే నిర్ణయించుకునే అధికారం ఉందన్నారు. ఇందులో కూడా రాష్ట్రాలపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. సీఎం స్థాయిలో ఉన్న కేసీఆర్ విద్యుత్ సంస్కరణలపై అవాస్తవాలు మాట్లాడటం సరికాదని కేంద్రమంత్రి(Central Minister) తెలిపారు.
సీఎం కేసీఆర్ ఏమన్నారంటే?
ఇటీవల నిర్వహించిన బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యుత్ సంస్కరణల పేరిట కేంద్ర ప్రభుత్వం(Central Govt) వ్యవసాయ బోర్లు, బావుల వద్ద మోటార్లకు మీటర్లు పెట్టాలని మెడపై కత్తి పెట్టిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెచ్చిన విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే లాండ్రీలు, పౌల్ట్రీలు, దళితులకు విద్యుత్ రాయితీలు ఇచ్చే అవకాశం ఉండదని సీఎం కేసీఆర్ అన్నారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు మాత్రమే ఎఫ్ఆర్‌బీఎం(FRBM) పరిమితి అరశాతం పెంచారన్నారు. దీని వల్ల ఐదేళ్లలో తెలంగాణ(Telangana)కు రూ.25 వేల కోట్ల నష్టం జరిగే అవకాశముందన్నారన్నారు.
విద్యుత్ సంస్కరణల్లో భాగంగా డ్రాఫ్ట్ బిల్లును కేంద్రం రాష్ట్రాలకు పంపిందన్న సీఎం కేసీఆర్... ఆ బిల్లుపై పలు రాష్ట్రాల సీఎంలు తమ అభిప్రాయాలు చెప్పారన్నారు. ఈ బిల్లును ఆమోదించడానికి ముందే కేంద్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. విద్యుత్ సంస్కరణల(Power Reforms)ను తెలంగాణ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించామన్నారు. కేంద్రం సంస్కరణలు పేరిట బెదిరింపులకు పాల్పడుతుందని కేసీఆర్ ఆరోపించారు. సంస్కరణలు అమలు చేస్తే ఎఫ్ఆర్‌బీఎం అరశాతం ఐదేళ్ల పాటు ఇస్తామన్నారని చెప్పారు. ఈ ముసాయిదా బిల్లుకు ఏపీ అంగీకరించిందన్నారు. శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో 25 వేల వ్యవసాయ మోటార్లు పెట్టారన్నారు. మిగతా విద్యుత్ మీటర్లకు రూ.737 కోట్లతో టెండర్లు కూడా పిలిచారన్నారు. కేంద్రం చెప్పినట్టు విద్యుత్ సంస్కరణలు అమలు చేయకపోతే తెలంగాణ ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు నష్టపోయే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. అయినా మోటార్లకు మీటర్లు పెట్టబోమని స్పష్టంగా చెప్పామన్నారు. సాగు కోసం కొత్త విద్యుత్ కనెక్షన్లు(Electricity Connections) ఇవ్వకూడదని కేంద్రం చెబుతుందన్నారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేయాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తెస్తుందన్నారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే లాండ్రీలకు, వస్త్ర పరిశ్రమకు, పౌల్ట్రీలకు, వ్యవసాయానికి, ఎస్సీలకు ఉచిత విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి ఉంటుందన్నారు. తెలంగాణలో తప్ప 24 గంటల విద్యుత్ ఏ రాష్ట్రం ఇవ్వటం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ(Privitization) చేయాలని కేంద్రం ఉద్దేశమన్నారు. బీజేపీకి చందాలు ఇచ్చే సంస్థల సోలార్ విద్యుత్ కొనాలంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.