Rohit Sharma on Virat Kohli: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి రోహిత్‌ శర్మ అండగా నిలిచాడు. అతడి ఫామ్‌ గురించి వదిలేయాలని సూచించాడు. రెండు దశాబ్దాలుగా క్రికెట్‌ ఆడుతున్న వాడికి ఎలా రాణించాలో తెలుసని వెల్లడించాడు. వెస్టిండీస్‌తో తొలి టీ20కు ముందు హిట్‌మ్యాన్‌ మాట్లాడాడు.


కొన్నాళ్లుగా డౌన్!


రెండేళ్లుగా విరాట్‌ కోహ్లీ ప్రదర్శనలో కాస్త మార్పు వచ్చింది. ఒకప్పటి స్థాయిలో ఆడటం లేదు. రెండేళ్లుగా శతకం బాదలేదు. మిగతా వారితో పోలిస్తే సగటు మాత్రం ఎక్కువగానే ఉంది. పైగా సమయోచితంగా పరుగులు చేస్తున్నాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీసులో మాత్రం విరాట్‌ విఫలమయ్యాడు. మూడు వన్డేల్లో కలిపి కేవలం 26 పరుగులు చేశాడు. దాంతో టీ20 సిరీసులో అతడెలా రాణిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తొలి మ్యాచుకు ముందు మీడియా సమావేశంలో విరాట్‌ ఫామ్‌ గురించి రోహిత్‌ను ప్రశ్నించడంతో అతడు జవాబిచ్చాడు.


ఎలా ఆడాలో తెలుసు!


'దాదాపు 20 ఏళ్ల నుంచి విరాట్‌ క్రికెట్‌ ఆడుతున్నాడు. ఎలా రాణించాలో అతడికి తెలుసు. దయచేసి అతడిని వదిలేయండి. అతడి గురించి మాట్లాడటం ఆపేయండి' అని హిట్‌మ్యాన్ మీడియాకు సూచించాడు. కుర్రాళ్లతో తానేమీ ప్రయోగాలు చేయడం లేదన్నాడు. రొటేషన్‌ చేస్తూ వారికి ఆత్మవిశ్వాసం కల్పిస్తున్నామని వెల్లడించాడు.


అంత పెద్ద మాటొద్దు!


'ప్రయోగం అనేది అతిగా ఉపయోగిస్తున్న పదం. నేను క్రికెటర్లకు కావాల్సినంత భద్రత కల్పించాలని అనుకుంటున్నా. అప్పుడే వారు రాణించగలరు. జట్టులో ఎక్కువ మంది కుర్రాళ్లు ఉన్నారు. వారు ఆకట్టుకోవాలంటే జట్టులో చోటు ఉంటుందన్న ఆలోచన కల్పించాలి' అని రోహిత్‌ చెప్పాడు. రెండు రోజుల ఐపీఎల్‌ వేలం మేనియా నుంచి ఆటగాళ్లు బయటకు రావాలని సూచించాడు. టీమ్‌ఇండియా తరఫున రాణించడంపై దృష్టి పెట్టాలి కోరాడు. 'ఐపీఎల్‌ భావోద్వేగాలు ముగిశాయి. రాబోయే రెండు వారాలు నీలి రంగు దుస్తుల్లో అదరగొట్టాలని గుర్తించాలి' అని హిట్‌మ్యాన్‌ సూచించాడు.


Also Read: భారత్, శ్రీలంక షెడ్యూల్‌లో మార్పులు - యాక్షన్ ఒకరోజు ముందే!


Also Read: టీ20 మూడ్‌లో టీమ్‌ఇండియా - ఇష్టమైన ఈడెన్‌లో ట్రైనింగ్‌ మామూలుగా లేదు!