Stock Market Update Telugu: హమ్మయ్యా..! ఘోర పతనం నుంచి స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. సోమవారం నాటి నష్టాలను మంగళవారం పూడ్చేశాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య కమ్ముకున్న యుద్ధభయాలు కాస్త తొలగడం, ఐరోపా మార్కెట్లు నిలకడగా రాణిస్తుండటం మదుపర్లలో సానుకూల సెంటిమెంటును పెంచింది. నిన్న షేర్లను తెగనమ్మిన ఇన్వెస్టర్లే నేడు కొనుగోళ్లకు ఎగబడ్డారు. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1736 పాయింట్లు రాణిస్తే నిఫ్టీ తన కీలక స్థాయి 17,300 ఎగువన ముగిసింది.
BSE Sensex
క్రితం సెషన్లో 56,405 వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు 56,731 వద్ద లాభాల్లో ఆరంభమైంది. కాసేపటికే 56,438 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఒడుదొడుకుల మధ్య కదలాడిన సూచీ భయాలు తొలగి కొనుగోళ్లు క్రమంగా పెరగడంతో భారీ స్థాయిలకు చేరుకుంది. 58,211 వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయి 58,142ను అందుకుంది. చివరికి 1736 పాయింట్లు లాభపడి 58,142 వద్ద ముగిసింది. సెన్సెక్స్ సోమవారం 1747 పాయింట్ల మేర పతనమైంది.
NSE Nifty
సోమవారం 16,842 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళారం 16,933 వద్ద మొదలైంది. 17,373 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరింది. పెట్టుబడుల వరద కొనసాగడంతో 17,375 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరికి 509 పాయింట్ల లాభంతో 17,352 వద్ద ముగిసింది. సోమవారం పతనమైన 532 పాయింట్లను పూడ్చేసింది!
Nifty Bank
బ్యాంక్ నిఫ్టీ మొదట్లో ఒడుదొడుల మధ్య సాగినా 11 గంటల తర్వాత పైపైకి సాగింది. ఉదయం 36,989 వద్ద మొదలైన సూచీ 36,651 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆపై పుంజుకొని 38,231 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. మొత్తంగా 1261 పాయింట్ల లాభంతో 38,170 వద్ద ముగిసింది.
Gainers and Losers
నిఫ్టీలో 48 కంపెనీల షేర్లు రాణించాయి. 2 నష్టపోయాయి. టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఐచర్ మోటార్స్, శ్రీసెమ్, హీరోమోటో కార్ప్ 4-7 శాతం మధ్య లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, సిప్లా 1-3 శాతం మేర నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు నేడు గ్రీన్‌లోనే ముగిశాయి. ఆటో, బ్యాంక్, రియాలిటీ, క్యాపిటల్ గూడ్స్, పీఎస్‌యూ బ్యాంక్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ సూచీలు 2-3 శాతం ఎగిశాయి. గత రెండు రోజుల్లో రూ.12.38 లక్షల కోట్లు నష్టపోగా నేడు దాదాపు రూ.8-10 లక్షల కోట్ల వరకు సంపద పెరిగింది.