ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని "మా" అధ్యక్షుడు మంచు విష్ణు ( Manchu Vishnu ) కలిశారు. ఆయన ఏ కారణంతో కలిశారో స్పష్టత లేదు. జగన్ (CM Jagan Family ) కుటుంబానికి మంచు విష్ణు బంధువు. అయితే ఇప్పుడు మంచు విష్ణు సతీ సమేతంగా రాలేదు. ఒక్కరే వచ్చారు. అందు వల్ల ఆయన టాలీవుడ్ ( Tollywood ) అంశాలపై చర్చించడానికి వచ్చారని భావిస్తున్నారు. టాలీవుడ్ సమస్యలపై ఇటీవల చిరంజీవి నేతృత్వంలోని బృందం జగన్ నివాసానికి వచ్చి చర్చలు జరిపింది. ఆ భేటీకి మోహన్ బాబుకు ( Mohan Babu ) ఆహ్వానం అందలేదు . అలాగే "మా" అధ్యక్షుడైన మంచు విష్ణుకూ ఆహ్వానం అందలేదు. ఆ తర్వాత రోజు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని హైదరాబాద్‌లోని మోహన్ బాబు ఇంట్లో సమావేశం కావడంతో ఆ భేటీకి వివరణ ఇచ్చారన్న ప్రచారం జరిగింది.
తర్వాత పేర్ని నాని ( Perni Nani ) ఆ వ్యాఖ్యలను ఖండించారు. అది కాఫీ మీటింగ్ అన్నారు. మొదట టాలీవుడ్ సమస్యలపై చర్చలు జరిపామని ట్వీట్ చేసిన విష్ణు ఆ తర్వాత ట్వీట్ డిలీట్ చేశారు. మూడు రోజుల వ్యవధిలోనే విష్ణు ఈ సారి నేరుగా సీఎం జగన్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. "మా" అధ్యక్షుడిగా ( MAA President) టాలీవుడ్ సమస్యలపై తన అభిప్రాయం చెప్పడానికి సీఎం జగన్ సమయం ఇచ్చారని భావిస్తున్నారు. అయితే సినీ ప్రముఖులు వచ్చినప్పుడు వారితో వ్యవహరించిన విధానం.. ఇప్పుడు మంచు విష్ణుకు లభించిన గౌరవం హాట్ టాపిక్ అవుతోంది. చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్ లాంటి సూపర్ స్టార్లు వచ్చినప్పటికీ వారి వాహనాలను ఇంటి గేటు బయట నిలిపివేసి సెక్యూరిటీ చెకింగ్ గెట్ వే ద్వారా అందర్నీ లోపలికి పంపారు. అయితే మంచు విష్ణుకు మాత్రం నేరుగా లోపలికి యాక్సెస్ అయ్యారు.
ఆయన కారులో నేరుగా సీఎం జగన్ ఇంటి వరకూ వెళ్లిపోయారు. ఈ రెండు దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎం జగన్ కావాలని టాలీవుడ్ స్టార్లను పిలిచి అవమానించారని జరుగుతున్న ప్రచారానికి మంచు విష్ణుకు లభించిన ప్రాధాన్యతతో మరింత బలం చేకూరినట్లయింది. అయితే మంచు విష్ణు కుటుంబసభ్యుడని .. కుటుంబసభ్యులకు జగన్ ఇంటి వరకూ పర్మిషన్ ఉంటుందని కొంత మంది గుర్తు చేస్తున్నారు. కారణం ఏదైనప్పటికీ... టాలీవుడ్ ప్రముఖులతో సీఎం చర్చలు.. ఆ తదనంతర పరిణామాలు హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి.