Medicines Ban: అసలే వర్షాకాలం చిన్న జలుబు చేసినా....కాస్త ఒళ్లు వెచ్చబడిందా అంతే పరుగెత్తుకుని మందుల షాపులకు వెళ్లి టాబ్లెట్‌లు తెచ్చుకుని వేసుకుంటారు. ఇంట్లో ఎవరికైనా కాస్త సుస్తి చేసిందంటే చాలు ప్రతిఒక్కరూ డాక్టర్( Doctor) అవతారం ఎత్తేస్తారు. అవసరం ఉన్నా లేకున్నా....మూడుపూటలు బిల్లలు వేస్తూనే ఉంటారు. దీనివల్ల ఉన్న రోగం సంగతి ఏమోగానీ కొత్తకొత్త రోగాలు అంటుకునే ప్రమాదం ఉంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్(Side Effects)లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రోగులకు ముప్పు తెచ్చే అవకాశం ఉన్న 156 రకాల మందులను నిషేధించింది. ఈ మందులు(Medicine) ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దని ప్రజలను హెచ్చరించింది.
కాంబినేషన్ మందులతో జాగ్రత్త
సాధారణంగా మనకు జ్వరం వస్తే...ముందు జాగ్రత్తగా జలుబుకు కూడా కలిపి కాంబినేషన్ మందులు తీసుకుంటాం. యాంటీబయోటిక్‌లో కూడా రెండు, మూడు రకాలు కలిపి ఉన్న కాంబినేషన్లు ఎక్కువగా వాడుతుంటారు. ఇలా అవసరం ఉన్నా లేకపోయిన ఇష్టానుసారం మందులు వాడకం వల్ల లేని ప్రమాదాలను కొని తెచ్చుకోవడమేనని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇబ్బందికరమైన 156 రకాల ఔషధాలను నిషేధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రజలు తరుచుగా వాడే జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీ మందులే ఎక్కుగా ఉన్నాయి. ప్రజలు ఎక్కువగా కాస్త ఒళ్లు నొప్పులు ఉండగానే నోప్పులతోపాటు పారాసిటమల్ కాంబినేషన్ మందులు తీసుకుంటారు.అందుకే ఎసిక్లోఫినాక్ పారాసిటమాల్ కాంబినేషన్ మందులను సైతం కేంద్రం నిషేధిత జాబితాలో ఉంచింది. ఈనెల 12నే వీటిని నిషేదిత జాబితాలో చేర్చుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 156 ఎఫ్‌డీసీలను తక్షణమే ఉత్పత్తి, నిల్వలు, విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించింది. వీటిల్లో ఎక్కువగా యాంటీబయోటిక్స్, నొప్పి, మల్టీ విటమిన్లు ఉన్నాయి. డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మందుల తయారీ సంస్థల వాదనలను డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు తోసిపుచ్చింది. కాంబినేషన్ మందుల వల్ల రోగులకు ప్రయోజనాలు చేకూరపోగా...మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింంది. అందుకే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ మందులను నిషేదిస్తున్నట్లు వెల్లడించింది.
రెండు లేదా మూడు ఔషధాలను కలిపి నిర్దిష్ట నిష్పత్తిలో తయారు చేసే మందులను ఎఫ్‌డీసీ(FDC) అంటారు. వీటిని కాక్‌టెయిల్ డ్రగ్స్ అని కూడా పిలుస్తారు. కేంద్రప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఈ ఎఫ్‌డీసీలపై అధ్యయనం చేసి అవి వాడకం మంచిది కావని నిర్థారించిన తర్వాత వాటిపై నిషేధం విధించారు. చిన్నచిన్న జబ్బులకు సైతం సొంత వైద్యం పనికిరాదని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఇష్టానుసారం మందుల దుకాణాల నుంచి టాబ్లెట్లు కొని వేసుకోరాదని సూచించారు. దీర్ఘకాలంలో అవి అవయవాలపై దుష్ప్రాభావం చూపుతాయని హెచ్చరించారు. నిపుణులైన వైద్యులను సంప్రదించిన తర్వాత...వారు సూచించిన మందులనే వాడాలని తెలిపారు. ఒక్కోసారి మందుల దుకాణదారులు సైతం డాక్టర్ రాసిన మందులు లేవని...వేరే కాంబినేషన్ ఉందని ఇస్తుంటారు. ఖచ్చితంగా అలాంటివి కూడా వద్దని చెప్పారు. నిర్దిష్టమైన రోగానికి...నిర్ధిష్టమైన మందులనే వైద్యులు సూచిస్తారని...అంతకు మించి ఇష్టానుసారం వాడటం మంచిది కాదని తెలిపారు.
Also Read: కోల్‌కతా కేసులో ఇంత గందరగోళం ఎందుకు? ఆ రోజు ఏం జరిగింది - ముందుగా డెడ్‌బాడీని చూసిందెవరు?