Kolkata Murder Case: కోల్‌కతా హత్యాచార కేసు గందరగోళంగా తయారైంది. హాస్పిటల్ వాళ్లు చెబుతున్న వివరాలకి, అసలు జరిగిన దానికి పొంతన ఉందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా FIR నమోదు చేసే విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా ఉండడమూ మరి కొన్ని సందేహాలను తెరపైకి తీసుకొచ్చింది. స్వయంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ప్రభుత్వానికి, పోలీసులకు అక్షింతలు వేసింది. అన్ని గంటల పాటు కేసు నమోదు చేయకుండా ఏం చేశారని కోర్టు పోలీసులను ప్రశ్నించింది. పోలీసులు మాత్రం ఆ సమయంలో వేరే విధుల్లో బిజీగా ఉండడం వల్ల ఆలస్యమైందని వివరిస్తున్నారు. ఈ సమాధానమూ అసహనానికి కారణమవుతోంది. అయితే...అసలు ఈ కేసులో ఇంత అయోమయం ఎందుకు..? ఆగస్టు 9వ తేదీన ఏం జరిగింది..?
ఆరోజు జరిగిందిదే..
ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లోని సెమినార్ హాల్‌లో ట్రైనీ డాక్టర్ మృతదేహం అర్ధనగ్నంగా పడి ఉంది. ఆగస్టు 9వ తేదీన ఉదయం 9.30 గంటలకు అదే హాస్పిటల్‌లో పని చేసే చెస్ట్ డాక్టర్ మొట్టమొదట ఆమె డెడ్‌బాడీని చూశాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సరిగ్గా 10.10 గంటలకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో జనరల్ డైరీ నమోదైంది. క్రైమ్ సీన్ నుంచి దాదాపు 40 ఆధారాలను పోలీసులు సేకరించారు. 11.45 నిముషాలకు FIR నమోదు చేశారు. మధ్యాహ్నం 3.40 నిముషాలకు హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్, వైస్ ప్రిన్సిపల్ పోలీసులకు ఈ ఘటనకు సంబంధించి ఓ లెటర్ అందించారు. సెమినార్ హాల్‌లో డెడ్‌బాడీ కనిపించినట్టు అందులో పేర్కొన్నారు.
ఆ లెటర్‌ని కాన్ఫిడెన్షియల్‌గా ఉంచారు. ఉదయం 10.10 గంటలకు కొంతమంది పోలీసులు, 10.30 గంటలకు మరి కొందరు పోలీసులు క్రైమ్ సీన్‌ని పరిశీలించారు. వెంటనే ఆ సెమినార్ హాల్‌ని సీజ్ చేశారు. 11-11.30 గంటల మధ్యలో సీనియర్ అధికారులతో పాటు ఫోరెన్సిక్ టీమ్ అక్కడికి వచ్చింది. క్రైమ్ సీన్‌లో ఫొటోలు, వీడియోలు తీశారు. ఈలోగా 10.52 నిముషాలకు బాధితురాలి తల్లిదండ్రులకు కాల్ చేసి ఈ ఘటన గురించి సమాచారం ఇచ్చారు. 1.00 గంటకు తల్లిదండ్రులు హాస్పిటల్‌లో అధికారులతో మాట్లాడారు. పది నిముషాల తరవాత సెమినార్ రూమ్‌కి బాధితురాలి తండ్రిని పంపించారు.
పోలీసుల రిపోర్ట్‌లో ఏముంది..?
మధ్యాహ్నం 12.44 నిముషాలకు బాధితురాలని చనిపోయినట్టు ధ్రువీకరించారు. 1.47 గంటలకు ఆమె మృతదేహాన్ని హాస్పిటల్ యాజమాన్యం పోలీసులకు అప్పగించింది. అయితే మధ్యాహ్నం 3గంటలకు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందే పోస్ట్‌మార్టం జరగాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. 4.20-4.40 గంటల మధ్య జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిగింది. అదంతా వీడియో తీశారు. సాయంత్రం 6.10-7.10 గంటల మధ్యలో మెజిస్ట్రేట్ సమక్షంలోనే పోస్ట్‌మార్టం జరిగింది. రాత్రి 8 గంటలకు డాగ్‌స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుంది. రాత్రి 11 గంటలకు తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించారు. 11.45 గంటలకు FIR నమోదు చేశారు.
పోలీసుల రిపోర్ట్ ప్రకారం సెమినార్ హాల్‌లో ఓ మహిళ అపస్మారక స్థితిలో అర్ధనగ్నంగా పడి ఉండడాన్ని గుర్తించారు. ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాలైనట్టు ఈ రిపోర్ట్‌లో ప్రస్తావించారు పోలీసులు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చేలోగా హాస్పిటల్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు. నలుగురు వైద్యులతో పాటు మొత్తం 11 మందిని విచారించారు. ఆ రాత్రి డ్యూటీలో ఉన్న వాళ్లందరినీ ప్రశ్నించారు. అయితే...11.45 గంటల వరకూ FIR నమోదు చేయకుండా ఉండడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కాలేజ్ ప్రిన్సిపల్‌తో ఎవరు మాట్లాడారు..? ఎందుకంత ఆలస్యమైందని ప్రశ్నించింది. అసహజ మరణం అని ముందే డిక్లేర్ చేసి ఆ తరవాత సాయంత్రం పోస్ట్‌మార్టమ్‌కి ఎలా పంపారని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు.