ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో ఓ సిట్టింగ్ న్యాయమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. అదనపు సెషన్స్, జిల్లా కోర్టు జడ్జి జస్టిస్ ఉత్తమ్ ఆనంద్‌ను బుధవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఆటోతో ఢీకొట్టి చంపేశారు. తొలుత ఈ ఘటనను పోలీసులు ప్రమాదంగా భావించగా.. సీసీటీవీ రికార్డులను పరిశీలించగా.. హత్య విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఘటనపై బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అసలేం జరిగింది?
జస్టిస్ ఉత్తమ్ ఆనంద్ బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో జాగింగ్ చేసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. రోడ్డు పక్కన జాగింగ్ చేసుకుంటూ వెళ్తుండగా.. ఓ ఆటో వచ్చి ఆయనకు ఢీకొట్టి వెళ్లింది. తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో పడి ఉన్న ఆయనను అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ న్యాయమూర్తి కన్నుమూశారు. అయితే చనిపోయిన వ్యక్తి ఓ జడ్జి అని తెలియకపోవడం వల్ల కొన్ని గంటల వరకు ఆయన మృతి విషయం తెలియలేదు.
ఉదయం 7 గంటలవుతున్నా జస్టిస్ ఆనంద్ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే గాలింపు చేపట్టడంతో ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో మరణించినట్లు తెలిసింది. దీంతో హిట్ అండ్ రన్‌గా పోలీసుల కేసు నమోదు చేశారు. అయితే ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా.. అసలు విషయం బయటపడింది. ఆటోలోని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఆయనను ఢీకొట్టి హత్య చేసినట్లు తెలియడంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు.
ఎవరు చేసి ఉంటారు?
న్యాయమూర్తినే హత్య చేసి పరారైన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఇప్పటికే గాలిస్తున్నారు. పక్కా పథకం ప్రకారమే హత్య చేసినట్లు సీసీ టీవీ ఫుటేజీలో తేలింది. అయితే ఎదైనా కేసుకు సంబంధించిన విషయమై ఆయనను హత్య చేశారా? లేక వ్యక్తిగత కక్షలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే న్యాయమూర్తి హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనపై బార్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని బార్ అసోసియేషన్ సుప్రీం కోర్టుకు తెలిపింది. తెలివిగా రోడ్డు యాక్సిడెంట్ లో చిత్రికంచినప్పటికీ సీసీటీవీలో రికార్డవడం వల్ల ఈ హత్య వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది.
ALSO READ:
Coronavirus India: వరుసగా రెండో రోజూ 40 వేలపైనే.. కేరళలో వైరస్ విజృంభణ
Raj Kundra - Shilpa Shetty Fined: శిల్పాశెట్టి దంపతులకు మరో షాక్.. చిక్కుల్లో బాలీవుడ్ నటి దంపతులు