ABP  WhatsApp

Astrazeneca Covid 19 Vaccine: కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారా? మరి ఇది విన్నారా ?

ABP Desam Updated at: 29 Jul 2021 12:31 PM (IST)

ఆస్ట్రాజెనెకా తొలిడోసు వ్యాక్సిన్‌ తీసుకున్న కొందరిలో స్వల్పంగా రక్తం గడ్డకట్టడం ఇటీవల గుర్తించారు. భారత్ లో కొవిషీల్డ్ పేరుతో సీరం సంస్థ ఈ టీకాను తయారుచేస్తోంది. మరి ఇది నిజమేనా? అధ్యయనం ఏం చెబుతోంది

AstraZeneca Vaccine

NEXT PREV

ఆస్ట్రాజెనెకా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్నవారిలో అదనంగా రక్తం గడ్డకట్టే ముప్పు ఉండదని బ్రిటన్‌కు చెందిన ఔషధ, ఆరోగ్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థ (ఎంహెచ్‌ఆర్‌ఏ) ధ్రువీకరించింది. భారత్‌లో కొవిషీల్డ్‌ పేరుతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఈ టీకాను తయారు చేస్తోంది. ఆస్ట్రాజెనెకా తొలిడోసు వ్యాక్సిన్‌ తీసుకున్న కొందరిలో స్వల్పంగా రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్స్‌ పడిపోవడం (థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్‌తో కూడిన థ్రోంబోసిస్‌-టీటీఎస్‌) తలెత్తుతున్నట్టు గుర్తించారు. దీంతో పలు దేశాలు ఈ టీకా వినియోగంపై వెనకడుగు వేస్తున్నాయి.


ఈ సమస్యపై దృష్టి సారించిన ఎంహెచ్‌ఆర్‌ఏ... తొలి, రెండో డోసు తీసుకున్న ఎంతమందిలో టీటీఎస్‌ తలెత్తుతోందన్న దానిపై అధ్యయనం సాగించింది. ప్రపంచ వ్యాప్తంగా ఔషధాలు, టీకాల కారణంగా ఎంతమందిలో టీటీఎస్‌ తలెత్తుతోందన్న ఆరోగ్య భద్రత వివరాలను విశ్లేషించింది. ఆస్ట్రాజెనెకా మొదటి డోసు తీసుకున్న 10 లక్షల మందిలో 8.1 మందికి వ్యాక్సిన్‌ కారక థ్రోంబోటిక్‌ థ్రోంబోసైటోపెనియా తలెత్తగా, రెండో డోసు తీసుకున్నవారిలో 2.3 మందిలోనే ఈ సమస్య అత్యంత స్వల్పంగా కనిపిస్తున్నట్టు గుర్తించింది.



మా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత టీటీఎస్‌ సంభవించేందుకు నిర్దిష్ట కారణాలేవీ లేవు. అయినా, దుష్ప్రభావాలకు సంబంధించి మా పరిశోధనలు కొనసాగుతాయి. ఒకవేళ ఎవరిలోనైనా రక్తం గడ్డకట్టే పరిస్థితి తలెత్తితే తక్షణ చికిత్సతో దాన్ని అధిగమించవచ్చు -               ఆస్ట్రాజెనెకా


ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌కు 80కు పైగా దేశాలు అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చాయి.


పిల్లలకు వ్యాక్సినేషన్..


దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ పై  ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారికి టీకా ప్రక్రియ కొనసాగుతోంది. మరి పిల్లలకు ఎప్పుడు టీకా అందుబాటులో వస్తుందన్న ప్రశ్నలకు తెరదించారు ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా. తాజాగా జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. "వచ్చే వారాల్లో లేదా సెప్టెంబరులోపే పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులో వచ్చే అవకాశాలున్నాయి. గుజరాత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డీ, ప్రపంచంలోనే డీఎన్‌ఏ ఆధారంగా తయారైన తొలి కొవిడ్‌ టీకా. జులై 1న కంపెనీ అత్యవసర అనుమతుల కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసుకొంది. 12 ఏళ్లకు పైబడిన వారిపై తమ టీకా పని చేస్తుంది. టీకా చిన్నారులపై ప్రయోగాలు పూర్తయింది. ఇక పిల్లలపై కొవాగ్జిన్‌ ట్రయిల్స్‌ సైతం త్వరలోనే పూర్తి కానున్నాయి. టీకా ఆమోదానికి సంబంధించి అపెక్స్‌ డ్రగ్‌ రెగ్యూలేటర్‌కు ఆమోదానికి పంపాం. వాటి నుంచి అనుమతులు రాగానే వెంటనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభిస్తాం. ఇప్పటి వరకూ 12 ఏళ్లలోపు పిల్లలకు అమెరికా వ్యాక్సిన్లు ఫైజర్‌, మోడెర్నా వేసేందుకు అనుమతి లభించింది. ఈ రెండు  mRNA టెక్నాలజీతో అభివృద్ధి చెందినవి" అని తెలిపారు.


మరోవైపు కొవాగ్జిన్ ట్రయల్స్‌ 12-18 ఏళ్లు, 6-12 ఏళ్లు మధ్య పిల్లలకు రెండు డోసుల టీకా ప్రయోగం పూర్తయింది. ఇప్పటికే 2-6 ఏళ్ల మధ్య చిన్నారులకు తొలిడోసు టీకా ఇవ్వగా.. రెండో డోసు టీకా ఇవ్వాల్సి ఉందని ఎయిమ్స్‌ తెలిపింది.

Published at: 29 Jul 2021 12:31 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.