మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రస్తుతం ఆయనకు  డ్రైవర్‌గా చేసిన దస్తగిరి అనే వ్యక్తి చుట్టూ తిరుగుతోంది. దస్తగిరిని గత వారం రోజులుగా తమ వద్దే ఉంచుకున్న సీబీఐ అధికారులు ప్రొద్దుటూరు కోర్టులో వాంగ్మూలం ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన ఏం వాంగ్మూలం ఇస్తారో కానీ దస్తగిరి ఈ కేసులో చాలా కీలకమైన వ్యక్తిగా సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే  వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత ఇంట్లో ఓ లెటర్ లభించింది. రక్తపు మరకలతో నిండిన ఆ లేఖ  వివేకా హత్య కేసులో కీలకమైన సాక్ష్యంగా ఉంది. 
 
 "డ్యూటీకి త్వరగా రమ్మన్నారని డ్రైవర్ చావగొట్టాడు. ఈ లేఖ రాయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. డ్రైవర్ ప్రసాద్‌ను వదలొద్దు.. ఇట్లు వివేకానందరెడ్డి...!" అనే మ్యాటర్ ఉన్న లేఖను  వైఎస్  కుటుంబీకులు పోలీసులకు ఇచ్చారు. హత్య జరిగినప్పుడు ప్రసాద్ డ్రైవర్‌గా ఉన్నారు. అంతకు ఏడాది ముందు వరకూ దస్తగిరి డ్రైవర్‌గా ఉండేవారు. దస్తగిరి మానేసిన తర్వాత ప్రసాద్ ఉద్యోగంలో చేరారు.  ప్రసాద్‌ను అప్పటి సిట్ అధికారులు తర్వాత సీబీఐ అధికారులు కూడా ప్రసాద్‌ను పలుమార్లు విచారించారు. కానీ మాజీ డ్రైవర్ దస్తగిరి మాత్రమే వారికి అనుమానాస్పదంగా కనిపిస్తున్నారు. అందుకే దస్తగిరి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలనుకుంటున్నారు.


డ్రైవర్ ప్రసాద్‌ కొట్టి చంపాడని వైఎస్ వివేకానందరెడ్డి రాసినట్లుగా చెబుతున్న లేఖ అప్పట్లో సంచలనాత్మకం అయింది. కొసప్రాణాలతో కొట్టుమిట్టాడుతన్న వ్యక్తి ఎలా ఈ లేఖ రాయగలుగుతారు..?  అనే దానిపై పరిశీలన జరిపేందుకు ఈ లేఖను పోలీసులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. అసలు వైఎస్‌ వివేకానే ఈ లేఖ రాశాడా ..? లేక ఇంకెవరైనా రాశారా అన్న కోణంలో వివరాలు సేకరించాలని ప్రయత్నించారు. కానీ రిపోర్ట్ ఏమిటో ఇంత వరకూ తేలలేదు. ఒక వేళ ఆ లేఖ వివేకా రాయకపోతే ఎవరు రాశారు..?  ఎందుకు రాశారు..? ఏ ఉద్దేశంతో రాశారు..? అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేయలేదు. ఒక వేళ వివేకానే రాసి ఉన్నట్లుగా తేలితే.. డ్రైవర్ ప్రసాద్‌పై కేసు నమోదు చేసి ఉండేవారే. కానీ ఆయనపై ఎటువంటి కేసులు నమోదు కాలేదు. ఇటీవల ఆయనను పెద్దగా పిలిచి ప్రశ్నించడం లేదు కూడా. 


వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి విషయంలో సీబీఐ అధికారులు కొన్ని అనుమానాలున్నాయి. పులివెందులలో ఉన్న ఓ చెప్పుల దుకాణ యజమానికి దస్తగిరి సన్నిహితుడు. గతంలో సీబీఐ అధికారులు విచారణ జరిగినప్పుడు చెప్పు దుకాణం యజమాని వద్ద పెద్ద ఎత్తున నగదు కొనుగొన్నారు. వాటిని సీజ్ చేశారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయో వివరాలు సేకరించారు. ఇప్పుడు దస్తగిరి నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు ప్రయత్నిస్తూండటంతో కీలకమైన విషయాలు వెల్లడించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.