Bengal News : బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అత్యంత సన్నిహితుడైన అనుబ్రతా మండల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. 2020 నాటి పశువుల అక్రమ రవాణా కేసులో విచారణలో భాగంగా గురువారం ఉదయం అనుబ్రతా మండల్ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. ఆయన్ను ఒక గదిలో దాదాపు గంటన్నరకు పైగా ప్రశ్నించారు. అయితే.. విచారణకు ఆయన సహకరించకపోవడంతోనే అరెస్ట్ చేశామని సీబీఐ అధికారులు తెలిపారు.
పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల తర్వాత జరిగిన హింసాకాండ కేసులో మండల్‌ను ప్రశ్నించేందుకు గతంలో సీబీఐ సమన్లు జారీ చేసింది. అయితే.. అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించి.. ఉత్తర్వులు పొందారు. గత కొంతకాలంగా హైపోక్సియా(ఆక్సిజన్ కొరత) రుగ్మతతో బాధపడుతున్న అనుబ్రతా మండల్ ఎక్కడకు వెళ్లినా ఆక్సిజన్ సిలిండర్‌ను తన వెంట తీసుకెళ్తుంటారు. ఆయన హెల్త్ కండీషన్ ప్రస్తుతం బాగానే ఉందని, ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆస్పత్రి డాక్టర్లు చెప్పడంతో మండల్ ను సీబీఐ అరెస్ట్ చేసింది.
మండల్ బెంగాల్‌లో వివాదాస్పదమైన నేత రౌడీషీటర్లకు ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. బీర్భూమ్ జిల్లాలో ఇసుక, రాళ్ల తవ్వకాలతో పాటు పశువుల అక్రమ రవాణాలోనూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లు అనుబ్రతా మండల్‌పై ఆరోపణలు ఉన్నాయి. అనుబ్రతా మండల్.. మమతకు అత్యంత సన్నిహితుడు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమత ఇచ్చిన ‘ఖేలా హోబ్’ నినాదానికి ప్రాచుర్యం కల్పించారు. బీర్భమ్ జిల్లాలో టీఎంసీకి బాహుబలి తరహా నేతగా మండల్ ను పార్టీ వర్గాలు అభివర్ణిస్తాయి.
అనుబ్రతా మండల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బీర్భమ్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 61 ఏళ్ల మండల్ బీర్భమ్ జిల్లాలో మంచి పట్టున్న రాజకీయ నాయకుడు. ఈ ప్రాంతంలో టీఎంసీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు గానూ పదింటిని టీఎంసీ కైవసం చేసుకుందంటే మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న అనుబ్రతా మండల్ ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. తెర వెనుక నుంచి చక్రం తిప్పడానికే ఇష్టపడే ఆయన టీఎంసీ కీలక వ్యూహకర్తలో ఒకరిగా బాగా గుర్తింపు పొందారు.