కార్ బార్బెక్యూ... ఇది ప్రస్తుతం వైజాగ్‌లో లేటెస్ట్ ఫుడ్ డెస్టినేషన్‌గా మారింది. విశాఖ బస్ స్టాండ్ సమీపంలోని నైట్ ఫుడ్ బజార్ గురించి తెలియని టూరిస్టులు ఉండరు. ఆ ఫుడ్ బజార్‌లోనే మూడేళ్ళ క్రితం కార్ బార్బెక్యూ పేరుతో ఒక బార్బెక్యూ సెంటర్ మొదలు పెట్టాడు కిషోర్ అనే యువకుడు. ఒక పాత అంబాసిడర్ కార్‌ను తీసుకుని దానిని సగానికి కట్ చేసి.. కారు ముందు భాగాన్ని బార్బెక్యూ మిషన్ గా మార్చేశాడు. ఇంజన్ స్థానంలో చికెన్,ఫిష్ పీసెస్ కాల్చేందుకు వీలుగా అమరిక చేసాడు. తనతోపాటు మరికొంత మందికి ఉపాధిని కల్పిస్తూ కార్ బార్బెక్యూ మొదలు పెట్టాడు. మొదట్లో నెమ్మదిగా ప్రారంభమైన బిజినెస్ ఇప్పుడు బాగా ఊపందుకుంది అని చెబుతున్నాడు కిషోర్. ఇలాంటిది ఇండియా లోనే వేరే చోట లేదంటాడు ఆయన. బైక్ బార్బెక్యూ లాంటి వెరైటీ లు ఉన్నాయి గానీ..ఇలా అంబాసిడర్ కార్ ను బార్బెక్యూ మిషన్ గా మార్చింది మాత్రం మొదటగా తామే అంటాడు కిషోర్.

 

వైజాగ్ లో స్ట్రీట్ ఫుడ్ లవర్స్ కి కొత్త అడ్డాగా మారిన కార్ బార్బెక్యూ

 

మన పల్లెటూళ్ళలో ఎప్పటి నుంచో ఉన్న చీకులు కాల్చే విధానానికి దగ్గరగా ఉండేదే బార్బెక్యూ. అమెరికా..యూకే..లాంటి దేశాల్లో ఒక జీవన విధానం అయిన బార్బెక్యూ రానూ రానూ ఫుడ్ వరల్డ్ లో ఒక ట్రెండింగ్ సెన్సేషన్ గా మారింది. స్టార్ హోటళ్ల లో సైతం ఖరీదైన ఫుడ్ కల్చర్ గా ఫుడ్ ప్రియులను ఆకట్టుకుంటుంది. అయితే దీనిని ఇటీవల స్ట్రీట్ ఫుడ్ గా సైతం అందుబాటులో కి తెచ్చారు వ్యాపారులు. దీంతో ధర పరంగానూ అందరికీ అందుబాటులోకి వచ్చింది బార్బెక్యూ.

 

వేడివేడి బొగ్గుల మీద మసాలా,కారం అద్దిన చికెన్,ఫిష్ లాంటి ఆహారపదార్థాలకు అతి తక్కువ నూనె,లేదా బటర్ పూసి కాల్చి తినే విధానమే బార్బెక్యూ. ఆహారాన్ని మన ముందే కాల్చడంతోపాటు..కాల్చే విధానమూ ఆశక్తి కరంగా ఉండడంతో బార్బెక్యూ కల్చర్ కి డిమాండ్ బాగా పెరిగింది. ఫ్రెండ్స్ తో కలసి..సాయంత్రం పూట సరదాగా అలా..వెళ్లి ..బార్బెక్యూలను తినడం సిటీలో చాలామందికి ఒక రొటీన్ గా మారింది అనడం లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందులోనూ, వైజాగ్ లోని కార్ బార్బెక్యూ అయితే మరింత ప్రత్యేకం గా మారింది.

 

అంబాసిడర్ కార్ ను బార్బెక్యూ యంత్రం గా మార్చడం దేశం లోనే తొలిసారి 

 

వైజాగ్ నైట్ ఫుడ్ కోర్ట్ లోని అనేక స్ట్రీట్ ఫుడ్ పాయింట్స్ లో కార్ బార్బెక్యూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. పసుపు పచ్చ కలర్ లో సగం మాత్రమే ఉండే అంబాసిడర్ కారు. దాని ఇంజన్ స్థానంలో చికెన్ కబాబ్ లూ..ఫిష్ ముక్కలూ..వేడివేడిగా కాలుతూ పిలుస్తూ ఉంటే ఫుడ్ లవర్స్ కి నూరు ఊరడం మాత్రం ఖాయం. అందుకే, వైజాగ్ లోని స్ట్రీట్ ఫుడ్ ప్రియులకు లేటెస్ట్ పేవరెట్ స్పాట్ గా ..ఈ కార్ బార్బెక్యూ మారిపోయింది.