Cancer Causing Chemicals in Cars: కార్‌ జర్నీ అంటే లగ్జరీ అనుకుంటాం కానీ మనకి తెలియకుండానే మన ఆరోగ్యం పాడైపోతుందని మాత్రం గమనించం. ఎంత ఎక్కువ దూరం ప్రయాణం చేస్తే అంత ప్రమాదం. కార్‌లో ట్రావెల్ చేసే వాళ్లు క్యాన్సర్ కారక రసాయనాలను పీల్చేస్తున్నారని ఓ కొత్త అధ్యయనం తేల్చి చెప్పింది. Environmental Science & Technology రీసెర్చర్స్ అధ్యయనం చేసి ఈ విషయం వెల్లడించారు. దాదాపు 101 ఎలక్ట్రిక్, గ్యాస్, హైబ్రిడ్ కార్‌లను పరిశీలించి ఆ క్యాబిన్‌లోని గాల్లో క్యాన్సర్ కారక రసాయనాలున్నాయని తేల్చి చెప్పారు. 2015-2022 మధ్య మోడల్స్‌లోని కార్‌లలో ఈ క్యాన్సర్ కారకాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. వీటిలో 99% మేర కార్‌లలో TCIPP అనే ఓ flame retardant ఉన్నట్టు తేలింది. మంటల్ని అదుపు చేసేందుకు వినియోగించే ఓ రకమైన కెమికల్ ఇది. దీనిపై ప్రస్తుతం అమెరికాలోని నేషనల్ టాక్సికాలజీ ప్రోగ్రామ్‌ అధ్యయనం చేపట్టింది. క్యాన్సర్‌ని కలిగించే carcinogen ఈ గాలిలో ఉన్నట్టు వెల్లడైంది. కొన్ని కార్స్‌లో  TCIPPతో పాటు మరో రెండు రకాల కెమికల్స్ కూడా ఉన్నట్టు గుర్తించారు. ఇవన్నీ క్యాన్సర్‌ ముప్పు తెచ్చి పెట్టేవే. ఈ కెమికల్స్‌ని ఎక్కువ సేపు పీల్చడం వల్ల న్యూరో సమస్యలతో పాటు పునరుత్పత్తి వ్యవస్థపైనా ప్రభావం పడే ప్రమాదముందని సైంటిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. 


పిల్లలకే ఎక్కువ ముప్పు..


ఓ రోజులో సగటున గంట పాటు కార్‌లో ప్రయాణించారనుకుంటే...అది కచ్చితంగా ఆరోగ్యానికి ప్రమాదమే అని తేల్చి చెబుతున్నారు. దీన్ని చిన్న సమస్యగా తీసుకోవద్దని అంటున్నారు. ఇక దూరపు ప్రయాణాలు చేసినప్పుడు ఎక్కువ సమయం కార్‌లో ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు పిల్లలకు ఎక్కువగా ముప్పు కలిగే అవకాశముంది. సాధారణంగా పెద్దలతో పోల్చి చూస్తే పిల్లలు ఎక్కువగా శ్వాస తీసుకుంటారు. అందుకే వాళ్లపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని సైంటిస్ట్‌లు వివరిస్తున్నారు. అయితే...ఈ హానికర రసాయనాలు వేసవిలోనే ఎక్కువగా విడుదలవుతాయి. ఎండాకాలంలో కార్‌ చాలా త్వరగా వేడెక్కిపోతుంది. ఆ సమయంలో కెమికల్స్ పెద్ద ఎత్తున రిలీజ్ అవుతాయి. కార్‌లలోని సీట్‌ ఫోమ్ నుంచే ఈ రసాయనాలు విడుదలవుతాయని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. కార్‌ తయారీ సంస్థలు సీట్‌ఫోమ్‌లతో పాటు ఇంటీరియర్‌లో మరి కొన్ని మెటీరియల్స్‌లో కెమికల్స్ యాడ్ చేస్తారని, అందుకే ఈ స్థాయిలో గాలి హానికరంగా మారుతుందని వివరిస్తున్నారు. 


లాభం కన్నా నష్టమే ఎక్కువ..


అగ్నిమాపక సిబ్బందిలో పని చేసే వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నది సైంటిస్ట్‌లు చెబుతున్న మరో కీలక విషయం. మంటల్ని అదుపు చేసేందుకు వినియోగించే కెమికల్స్‌లో హానికర రసాయనాలుంటాయి. కార్‌లలో మంటలు వ్యాపించకుండా ఈ కెమికల్స్ వాడుతున్నట్టుగా చెబుతున్నా...వాటి వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఎప్పుడైనా పొరపాటున మంటలు అంటుకుంటే ఆ రసాయనాలు గాల్లోకి విడుదలై అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తాయని అంటున్నారు. అందుకే వీటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టం చేస్తున్నారు. 


Also Read: Google Wallet: ఇండియాలోనూ గూగుల్‌ వ్యాలెట్‌ యాప్‌ వచ్చేసింది, ఫీచర్స్ భలే ఉన్నాయే!