Excise Policy Case: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి (Arvind Kejriwal) ఈడీ ఏడోసారి సమన్లు పంపింది. లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేజ్రీవాల్. ఈ కేసులో ఆరు సార్లు సమన్లు పంపినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. అయితే...ఈ సమన్లపై ఆయన స్పందించారు. కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నట్టు వెల్లడించారు. పదేపదే ఇలా సమన్లు పంపడం కన్నా కోర్టు ఏదోటి తేల్చేయాలని అన్నారు. ఏడోసారి కూడా సమన్లను పట్టించుకోలేదు కేజ్రీవాల్. కేవలం కాంగ్రెస్‌తో తాము చేతులు కలుపుతున్నందుకే బీజేపీ కుట్ర పూరితంగా తమను టార్గెట్ చేసినట్టు ఆరోపించారు. అంతే కాదు. లోక్‌సభ ఎన్నికల ముందు I.N.D.I.A కూటమిని విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని మండి పడ్డారు. ఆ కూటమితో తెగదెంపులు చేసుకోవాలనే ఇలా బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించారు. 


"ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయాలన్నదే బీజేపీ కుట్ర. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కోర్టు వరకూ వెళ్లింది. అలాంటప్పుడు కోర్టు తీర్పు ఏమిస్తుందో ఎదురు చూడాలిగా..? కోర్టు నిర్ణయమేంటో తెలుసుకోవాలిగా. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. ఇలా మళ్లీ మళ్లీ సమన్లు జారీ చేయడం దేనికి..? ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేయాలంటూ కొందరు మాపై ఒత్తిడి తెస్తున్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఈ ప్రతిపక్ష కూటమి నుంచి బయటకు రాం"


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి 


 






ఇప్పటికే బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేస్తోందని అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులూ ఇదే విధంగా ఆరోపించారు. కొంత మంది ఆప్‌ నేతలకు బీజేపీ నుంచి మెసేజ్‌లు వచ్చాయని అన్నారు. బీజేపీలో చేరకపోతే ఈడీ, CBIతో దాడులు చేయిస్తామని బెదిరిస్తున్నట్టు చెప్పారు. గతేడాది నవంబర్ నుంచి విచారణకు హాజరు కాకుండా దాటవేస్తూ వస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్. మార్చి 16వ తేదీన నేరుగా కోర్టులో హాజరు కావాలని ఆదేశాలందాయి. అందుకు కేజ్రీవాల్ అంగీకరించారు. గతంలో బడ్జెట్ సమావేశాలున్నందున విచారణకు హాజరు కాలేకపోయామని తెలిపారు. ఈడీ ప్రకారం...ఎక్సైజ్ పాలసీని ఫైనలైజ్ చేసేందుకు ఆప్ రూ.100 కోట్ల లంచం తీసుకుంది. గోవా ఎన్నికల్లో ప్రచారం కోసం ఈ డబ్బుల్నే వినియోగించారని ఆరోపిస్తోంది ఈడీ. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు ఆప్ నేతలు మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు. 


Also Read: 2 వేల రైల్వే ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన, వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ