Cab Drivers' Protests in Shamshabad Airport: శంషాబాద్‌ విమానాశ్రయంలో క్యాబ్‌ డ్రైవర్లు శనివారం మధ్యాహ్నం నిరసన తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వందలాది వస్తున్న క్యాబ్‌, ట్యాక్సీలు వల్ల ఉపాధి కోల్పోవాల్సి వస్తోందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు క్యాబ్‌ డ్రైవర్లు అసోసియేషన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ.. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెల్లడించారు. తాము లక్షలు వెచ్చించి కార్లు కొనుగోలు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని, అయితే తమ కుటుంబ పోషనపై పలువురు దెబ్బ కొడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిరోజూ వందలాది ట్యాక్సీలు, క్యాబ్‌లు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వస్తున్నాయని, దీనివల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి తాము ట్యాక్స్‌లు కడుతున్నామని, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు ట్యాక్స్‌లు కట్టేవాళ్లు ఇక్కడ వాహనాలు తిప్పుతూ తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారంటూ నిరసన తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి క్యాబ్‌లు, ట్యాక్సీలు విమానాశ్రయానికి రాకుండా అడ్డుకట్టే వేయాలని డిమాండ్‌ చేశారు. 


కంపెనీలు తమకే అవకాశం ఇవ్వాలి


తెలంగాణలోని ఐటీ కంపెనీలు, ఇతర ప్రభుత్వశాఖలు కూడా తెలంగాణకు చెందిన డ్రైవర్లకు చెందిన వాహనాలను మాత్రమే బుక్‌ చేసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. రెండు, మూడు రోజులపాటు ఎయిర్‌పోర్టు వద్దే ఉంటున్నా చాలా మందికి బేరాలు దొరకడం లేదని, దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు క్యాబ్‌ డ్రైవర్లు వెల్లడించారు. స్థానికేతరులు వందలాది మంది ఎయిర్‌పోర్టు వద్ద కార్లు తిప్పుతున్నారని, ఈ వాహనాలపై ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులు దృష్టి సారించాలని డిఒమాండ్‌ చేశారు. తెలంగాణలో రిజిస్ర్టేషన్‌ అయిన వాహనాలను మాత్రమే బుక్‌ చేసుకునేలా చర్యలు తీసుకోవాలంటూ కోరారు. లేదంటే పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే కార్లు పూర్తిగా నిలిపేసి తమ నిరసనను తెలియజేస్తున్నామని, దీనిపై స్పందించకపోతే మరింతగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 


ఒకే కారుకు రెండు నెంబర్లు






ఈ సందర్భంగా క్యాబ్‌ డ్రైవర్లు పలు ఆరోపణలు చేశారు. ఏపీకి చెందిన కొంత మంది క్యాబ్‌ డ్రైవర్లు ఒకే కారుకు రెండు నెంబర్లు తయారు చేసి నడుపుతున్నట్టు వెల్లడించారు. ట్యాక్సీ ప్లేట్‌తో ఒకటి, సొంత నెంబర్‌ ప్లేట్‌ మరొకటి పెట్టి వాహనాలు నడుపుతున్న విషయాన్ని తెలియజేశారు. మరికొందరు క్యాబ్‌ డ్రైవర్లు ఆన్‌ డ్యూటీ అంటూ స్టేట్‌, సెంట్రల్‌ గవర్నమెంట్‌ అని స్టిక్కర్లు వేసుకుని ప్యాసింజర్లను తీసుకెళుతున్నట్టు ఆరోపించారు. దీనివల్ల తెలంగాణకు చెందిన ట్యాక్సీ డ్రైవర్లకు తీవ్ర అన్యాయం జరుగుతున్నట్టు తెలిపారు. ఓలా, ఊబర్‌ ట్యాక్సీ కార్లు నడుపుతూ ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నామని, మరో పక్క ఈఎంఐలు చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. ఈ తరహా డ్రైవర్లపై ఆర్‌టీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ట్యాక్సీలపై నిఘా పెట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ నుంచి కస్టమర్లతో వెళ్లేటప్పుడు కర్ణాటక పోలీసులు నుంచి వేధింపులు పెరిగాయని, డబ్బులు ఇస్తేగానీ గమ్య స్థానానికి చేరుకోనీయడం లేదంటూ ఆరోపించారు. తమ ఇబ్బందులను అధికారులు, ప్రభుత్వ పెద్దలు గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని, తమకు న్యాయం చేయాలంటూ క్యాబ్‌ డ్రైవర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు.