AP Cm Chandrababu responds over Chagalamarri incident in Nandyal District | అమరావతి: నంద్యాల జిల్లాలో మిద్దె కూలి ఓ కుటుంబంలో న‌లుగురు మృతి చెందిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో అర్ధరాత్రి మ‌ట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో న‌లుగురు చనిపోవడంపై చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. అంతా నిద్రిస్తున్న సమయంలో  కుటుంబంపై అర్ధరాత్రి మట్టి మిద్దె కూలింది. ఈ ఘటనలో తల్లపురెడ్డి గురుశేఖర్ తో పాటు ఆయ‌న భార్య, ఇద్దరు పిల్లలు మృతిచెందారు.


బాలికకు రూ.10 లక్షల సాయం
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నానిపోయి మట్టి మిద్దె కూలిపోయింది. ఇంట్లో నిద్రిస్తున్న గురుశేఖర్ తో పాటు అతడి భార్య దస్తగిరమ్మ, కుమార్తెలు గురులక్ష్మి, పవిత్ర సైతం ప్రాణాలు కోల్పోయారు. రెండో కుమార్తె తల్లపురెడ్డి గురు ప్రసన్న(15) ప్రస్తుతం ప్రొద్దుటూరులో పదో తరగతి చదువుకుంటోంది. అయితే రాత్రికి రాత్రి తల్లిదండ్రులు సహా తోబుట్టువులు మొత్తం నలుగురు చనిపోవడంతో ప్రసన్న అనాథగా మారింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమాచారం తెలుసుకుని, బాధిత బాలిక ప్రసన్నకు అండగా ఉంటామన్నారు. ఏపీ ప్రభుత్వం తరుపున రూ.10 లక్షల సాయం ప్రకటించారు. 


ప్రసన్న నానమ్మకు సైతం సాయం 
ఆ బాలిక ప్రస్తుతం తన నాయనమ్మ తల్లపురెడ్డి నాగమ్మ సంరక్షణలో ఉంది. ఈ విషయాన్ని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. దాంతో విద్యార్థిని ప్రసన్న పేరుతో రూ.10 లక్షలు డిపాజిట్ చేశారు. వృద్ధురాలు నాగమ్మకు సైతం రూ.2 లక్ష సాయం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను అదేశించారు. జిల్లా అధికారులు కుటుంబాన్ని కోల్పోయిన బాలిక ప్రసన్నను కలిసి ధైర్యం చెప్పాలని ఆయన సూచించారు. ఇంటి మిద్దె కూలి తల్లిదండ్రులను, తోబుట్టువులను కోల్పోయిన ప్రసన్నకు అండగా నిలవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు పార్టీ పరంగా సైతం ప్రసన్నకు అండగా నిలుస్తామని అన్నారు. బాలిక సంరక్షణ, ఉన్నత చదువుల విషయంలో టీడీపీ కూడా అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.


Also Read: ఏపీలో అమల్లోకి రెడ్ బుక్ రాజ్యాంగం! వైసీపీ కార్యకర్తలను కలిసిన తరువాత పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు