BS Yediyurappa Resigns: కర్ణాటక సీఎం యడియూరప్ప రాజీనామా

ABP Desam Updated at: 26 Jul 2021 03:00 PM (IST)

కర్ణాటక సీఎం యడియూరప్ప రాజీనామా చేశారు. అందరూ ఊహించినట్లుగానే తన రెండేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

BS_Yediyurappa

NEXT PREV

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప రాజీనామా చేశారు. మధ్యహ్నం లంచ్ తర్వాత ఆయన గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. ఈ సందర్భంగా యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు.



ప్రధాని మోదీ, అమిత్ షా రాబోయే పార్లమెంట్ ఎన్నికలను గెలవాలి. భారత్.. ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా ఎదగాలి. నేను సంతోషంగా ఉన్నాను. ఈ సందర్భంగా మోదీ, అమిత్ షాకు కృతజ్ఞతలు. -     యడియూరప్ప



నడ్డా కీలక వ్యాఖ్యలు..


యడియూరప్ప రాజీనామాపై భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలో నాయకత్వ సంక్షోభమేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి యడియూరప్ప తనదైన శైలిలో బాగా పనిచేస్తున్నారంటూ కితాబిచ్చారు. గోవాలో రెండు రోజుల పర్యటనను ముగించుకున్న నడ్డా ఆదివారం విలేకర్ల సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. గోవాలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం ప్రమోద్‌ సావంత్‌ నేతృత్వంలోనే భాజపా బరిలో దిగుతుందని నడ్డా పేర్కొన్నారు. దీనిపై పార్టీ పార్లమెంటరీ బోర్డు త్వరలోనే అధికారికంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. దేశంలో కాంగ్రెస్‌ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైందని నడ్డా ఎద్దేవా చేశారు.


ఆటుపోట్ల సర్కార్..


 సమన్వయం లేని జనతాదళ్‌- కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కారు కూలిన వెంటనే మొదలైన యడియూరప్ప భాజపా సర్కారు రెండేళ్లుగా ఆటుపోట్లతో ఊగిసలాడుతోంది. 2019 జులై 26న ముఖ్యమంత్రిగా బి.ఎస్‌.యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారంతో ఆ సర్కారుకు రెండేళ్లు నిండుతుంది. ఈ రెండేళ్లలో సర్కారు పయనం ఏమంత సజావుగా సాగలేదు. 2008 నుంచి 2013 వరకు ఐదేళ్ల పాటు భాజపా సర్కారు నడిచినా వివిధ కారణాలతో మూడుసార్లు నాయకత్వాన్ని మార్చాల్సి వచ్చింది. 2018లోనూ అత్యధిక స్థానాలు పొందినా అధికారానికి సరిపడా సంఖ్యాబలం లేక.. కేవలం ఆరు రోజులకే చతికిల పడింది. ఆపై సంకీర్ణ సర్కారు కూలిపోగా 2019 జులై 26న మరోమారు యడియూరప్ప నాయకత్వంలోనే భాజపా సర్కారు ఏర్పాటు కావడం నిన్నటి చరిత్ర. రెండేళ్ల పాటు యడియూరప్ప నేతృత్వంలో సర్కారు బండి నడిచినా లెక్కలేనన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది.


ఆది నుంచి తడబాటు


సర్కారు ఏర్పాటైన కేవలం పది రోజులకే ఉత్తర కర్ణాటకలో భారీ వర్షాలు పలకరించాయి. మహారాష్ట్రలో ఎప్పటిలాగే కురిసిన భారీ వర్షాలతో రాష్ట్ర సరిహద్దులోని 10 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. అప్పటికీ మంత్రివర్గాన్నే ఏర్పాటు చేయని యడియూరప్ప తానొక్కడే వరద ప్రాంతాలను సందర్శించారు. ఆగస్టు 5 నుంచి మూడు రోజుల పాటు బెళగావి, కొడగు, రాయచూరు తదితర జిల్లాలను చుట్టేశారు. ఆప్పటికి రూ.38 వేల కోట్ల వరద నష్టాన్ని అంచనా వేసినా కేంద్ర సర్కారు కేవలం రూ.1,809 కోట్లు మాత్రమే విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే సర్కారు ఉంటే ఎంతో సానుకూలమని ప్రకటించిన యడియూరప్పకు ఈ పరిహారం పెద్ద ఎదురుదెబ్భ 2020 ఏడాది జులై, ఆగస్టు, సెప్టెంబరులోనూ భారీ వర్షాల కారణంగా 15 జిల్లాల్లో 157 తాలూకాలు నష్టపోయాయి. నాడు కేంద్ర సర్కారు రూ.890 కోట్లు మాత్రమే విడుదల చేయటంతో రాష్ట్ర సర్కారు తీవ్ర నిరాశకు గురైంది.


కరోనాతో కష్టాలు


సర్కారు ఏర్పాటైన ఎనిమిది నెలల్లోనే కరోనా రూపంలో మరో అవాంతరం ఎదురైంది. యావత్తు ప్రపంచంతో పాటు రాష్ట్రంలోనూ కరోనా సృష్టించిన సమస్యలు అన్నీ ఇన్నీ కావు. 2020 ఏప్రిల్‌ నుంచి జులై వరకు విధించిన లాక్‌డౌన్‌తో ఆదాయం గణనీయంగా తగ్గింది. వైద్య సదుపాయాల కోసం వేల కోట్లను వ్యయం చేసిన సర్కారు కేంద్ర సాయాన్ని కోరినా అడపాదడపా విడుదల చేసింది రూ.950 కోట్లు మాత్రమే. పీఎం కేర్స్‌ నుంచి వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు అందినా.. చాలక పోవటంతో రాష్ట్ర సర్కారు రూ.50వేల కోట్ల అదనపు వ్యయం చేసి.. ఖజానా ఖాళీ చేసుకుంది. రూ.2,500కోట్ల ఆర్థిక ప్యాకేజీ, రైతులు, వీధి వ్యాపారులకు ప్రత్యేక రుణ సదుపాయం కల్పించిన సర్కారుకు రాబడి కంటే పోబడి మరింత భారంగా మారింది. 2020 ఆగస్టు నుంచి కరోనా కేసులు తగ్గి ఆర్థికంగా పుంజుకున్నా 2021 ఫిబ్రవరి నుంచి రెండో దఫా కరోనా మరిన్ని అవాంతరాలు సృష్టించింది.



Published at: 26 Jul 2021 12:13 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.