KTR Comments in Karimnagar: కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు  గ్యారంటీలు కాదు 420 హామీలిచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. ఏడ్చుకుంటూ, తుడుచుకుంటూ  గెలిచిన ఎమ్మెల్యేలు హామీలు నెరవేర్చకపోతే బట్టలిప్పి కొడతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరెంట్ బిల్లు కట్టవద్దని రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారని.. ఆ సంగతి ఏమైందని ప్రశ్నించారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ (KTR) మాట్లాడారు.


‘‘సోషల్ మీడియాను నమ్ముకొని మోదీ ప్రధాని అయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. నిజానికి కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తామనుకోలేదు. ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చారు. అనుభవం లేదు కాబట్టే ఇప్పటి వరకు రైతుబంధు వేయలేదు. రైతు భరోసా ప్రారంభించానని గుంపు మేస్త్రి దావోస్ లో చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  రైతుబందు  పడలేదంటే చెప్పుతీసుకొని కొడతా అంటున్నారు. రైతుబందు పడని వారు వీళ్ళని ఏ చెప్పుతో కొడతారో మీ ఇష్టం.              


రైతులు ఇప్పటికే మంట మీదున్నారు. క్వింటాలు మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదు. గుంపు మేస్త్రి ఇది వరకు పని చేసిన తెలివి లేదు. ఈ ప్రభుత్వం 45 రోజుల్లోనే చాలా మందిని  శత్రువులను చేసుకుంది. గుంపు మేస్త్రి పాలనలో ప్రజలు క్యూ కడుతున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలు గొడవకు దిగుతున్నారు. హామీ ఇచ్చే ముందు ఆర్టీసీ గురించి ఆలోచించలేదు. ప్రయాణికుల ఇబ్బందులపై మంత్రి పొన్నం సమాధానం ఇవ్వాలి. ఆటో డ్రైవర్ లు ఆకలితో అలమటిస్తున్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం ఎప్పుడు అమలు చేస్తారు? కాంగ్రెస్ కు వంద రోజుల సమయం ఇస్తున్నాం. కాంగ్రెస్ 420 హామీల గురించి మాట్లాడుదాం. అదానీ మోదీ మనిషి అని కేసీఆర్  తెలంగాణలో అడుగు పెట్టనివ్వలేదు.


రేవంత్ రెడ్డి.. ఎక్ నాథ్ షిండే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయనకు ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయి. ఆయన ఏమైనా చేస్తారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే.. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా.. బీజేపీ, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయి. గత ఎన్నికల్లో తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారు. బీజేపీ వచ్చిన తరువాత.. బొట్టు పెట్టడం నేర్చుకున్నామా.. గుడిలోకి వెళ్లడం వాళ్లు మనకు నేర్పారా? మనం హిందువులం కాదా..?


బీజేపీ వాళ్లు దేవుడితో రాజకీయం చేస్తున్నారు. కరీంనగర్ కి సంజయ్.. ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి. మేం బహిరంగ చర్చకు సిద్ధం. వినోద్ కుమార్.. బహిరంగ చర్చకు వస్తారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. బండి చేతగాని మనిషి’’ అని కేటీఆర్ అన్నారు.