Sharmila Satires On YS Jagan | కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. బుధవారం విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె దస్పల్ల హోటల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. షర్మిల సమక్షంలో ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల తన అన్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై సెటైర్లు వేశారు. మూడు రోజుల కిందట సీఎం జగన్ పై విమర్శలు చేస్తూ జగన్ రెడ్డి అని సంబోధించిన షర్మిలను.. ఆమె బంధువు వైవీ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.
విశాఖలో మాట్లాడిన షర్మిల.. జగనన్న గారు అని సంబోధిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసిపి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందంటూ, దీనికి కారణం జగనన్న గారు కాదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా కోసం జగనన్న గారు ఎన్నో మాటలు చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం మూకమ్మడిగా రాజీనామాలు చేద్దామని జగనన్న గారు చెప్పారని, 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పిన జగనన్న గారు ఎందుకు ఆ మాట నిలబెట్టుకోలేకపోయారని షర్మిల ప్రశ్నించారు. ఎన్నికల్లో స్పెషల్ స్టేటస్ నినాదంగా ఎత్తుకొని జగనన్న గారు పోటీ చేశారని షర్మిల పేర్కొన్నారు. జగనన్న గారు చెప్పిన ఈ మాటలన్నీ అవాస్తవమా..? అని ఆమె ప్రశ్నించారు. ఒక్కసారి కూడా బిజెపిని స్పెషల్ స్టేటస్ కోసం జగనన్న గారు ప్రశ్నించలేదని షర్మిల ఆరోపించారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజీ కూడా లేకుండా పోయిందని షర్మిల విమర్శించారు.
రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు..
అధికార, ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంధ్ర రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు. బీజేపీతో టీడీపీ, వైసీపీ కుమ్మక్కయ్యాయన్నారు. బీజేపీతో చంద్రబాబువి బయటకు కనిపించే పొత్తులని, వైసీపీవి కనిపించని పొత్తులన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అధికార ప్రతిపక్షాలు రెండు మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని కంపెనీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా కట్టబెడుతున్నారన్నారు. గంగవరం పోర్టును 600 కోట్లకు అదానీకి అమ్మేశారన్నారు. 30 ఏళ్ల లీజు తర్వాత గంగవరం పోర్ట్ ప్రభుత్వ పరం కావాల్సి ఉందని, కానీ ప్రభుత్వం ఆదానికి అమ్ముతోందని ఆరోపించారు. నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ వాటా 10 శాతం తక్కువకు అమ్మేశారని విమర్శించారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం ఒక కుట్ర అని షర్మిల ఆరోపించారు. ఇందిరమ్మ హయాంలో ఏర్పడిన విశాఖ స్టీల్ ను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దీన్ని కాపాడుతుందని స్పష్టం చేశారు. వైఎస్సార్ హయాంలో మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన స్టీల్ ప్లాంట్ ను ఏడు మిలియన్ టన్నుల ఉత్పత్తి కి పెంచారని వెల్లడించారు. నష్టాల సాకు చూపి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని, ఇది తగదన్నారు. విశాఖకి రైల్వే జోన్ , ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని, బిజెపి రాష్ట్రాన్ని ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు.రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, అధికారంలోకి వచ్చిన వెంటనే విభజన హామీలను అమలు చేయడంతో పాటు స్టీల్ ప్లాంట్ ను పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. బీజేపీకి తొత్తులుగా ఉన్న వైసీపీ, టీడీపీ లను ఓడగొట్టాలని, అంతవరకు క్యాడర్ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
భారీగా తరలివచ్చిన కార్యకర్తలు..
షర్మిల పర్యటన సందర్భంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా కార్యకర్తల కోలాహలం కనిపించింది. సుమారు 10 ఏళ్ల తర్వాత భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పార్టీ సమావేశానికి హాజరయ్యారు. వివిధ పార్టీలకు చెందిన సుమారు వందమంది నాయకులు కార్యకర్తలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో వైసీపీకి చెందిన కొయ్యి ప్రసాద్ రెడ్డి తో పాటు పలువురు నాయకులు ఉన్నారు. షర్మిల ప్రసంగిస్తున్న సేపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈలలు వేస్తూ సందడి చేశారు.