BRS Training Camps: మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ శిక్షణ శిబిరాలకు రంగం సిద్ధమైంది. తెలంగాణలో కాకుండా దేశంలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న తొలి శిక్షణ శిబిరం ఇదే కావడం గమనార్హం. రెండు రోజుల పాటు జరిగే ఈ శిక్షణ శిబిరాలను బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించ బోతున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. శిబిరం నిర్వహించే అనంత్ లాన్స్ వేదికను నాందేడ్ ఎస్పీ శ్రీకృష్ణ కొకాటే పరిశీలించారు. ఈ క్రమంలోనే నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. పాస్ లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. నాందేడ్ విమానాశ్రయం నుంచి సీఎం కేసీఆర్ ప్రయాణించే మార్గంలో ఆయన కాన్వాయ్ లోనూ అనుమతి ఉన్న వాహనాలనే అనుమతిస్తామని చెప్పుకొచ్చారు. అలాగే అనుమతి లేని వాహనాలను అవసరం అయితే సీజ్ చేస్తామని వెల్లడించారు. మరోవైపు సీఎం కేసీఆర్ కాన్వాయ్ ప్రయాణించే నాందేడ్ విమానాశ్రయం - అనంత్ లాన్స్ మార్గంలో ట్రయల్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు ఉమ్మడి కార్యాచరణను రూపొందించారు. రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్, పార్టీ సీనియర్ నేత రవీందర్ సింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 


అసెంబ్లీ నియోజక వర్గ పార్టీ ముఖ్య నాయకులకు మాత్రమే ఆహ్వానం


నాందేడ్ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ.. పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. స్పెషల్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సీఎం కేసీఆర్, మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే తదితర ముఖ్య నేతల ఫొటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నాందేడ్ మొత్తం గులాబీ మయమైపోయింది. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులను మాత్రమే శిక్షణా శిబిరాలకు ఆహ్వానించారు. ఇప్పటికే అన్ని నియోజకవ ర్గాలకు కన్వీనర్లు, సమన్వయ కర్తలను పార్టీ నియమించింది. మహారాష్ట్రలోని ఆరు డివిజన్లకు సంబంధించిన ముఖ్య నాయకులతో పాటు ప్రతీ నియోజక వర్గం నుంచి కన్వీనర్, సమన్వయకర్త, మహిళా విభాగం కన్వీనర్, రైతు విభాగం కన్వీనర్, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ, మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఇతర ముఖ్య నాయకులను ఆహ్వానించారు. 


శిక్షణ అనంతరం పార్టీ ప్రచార సామగ్రి అందజేత 


రెండు రోజుల శిక్షణ తర్వాత నియోజక వర్గాల వారీగా పార్టీ ప్రచార సామగ్రిని పార్టీ బాధ్యులకు అందజేస్తారు. వాటిలో కర పత్రాలు, గులాబీ కండువాలు, టోపీలు, వాల్ పోస్టర్లు ఉంటాయి. వీటితో పాటు నెల రోజుల పాటు చేపట్టనున్న పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన పుస్తకాలను కూడా నియోజక వర్గాల వారీగా పంపిణీ చేయనున్నారు. మహారాష్ట్ర స్థానిక కళా సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన పాటలు, వివిధ కళారూపాలకు సంబంధించిన సాంస్కృతిక బాండాగారాన్ని సైతం పెన్ డ్రైవ్ ల రూపంలో అందజేయనున్నారు. 


Also Read: పేర్లు పెట్టి మరీ నేతలకు పిలుపులు - గెలిచే పార్టీ ఇమేజ్ కోసం రేవంత్ రెడ్డి చేరికల వ్యూహాలు ?


Also Read: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారా? మళ్లీ కాంగ్రెస్‌లో చేరతారా?