Kadiyam Srihari comments on BJP: షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో 30 సంవత్సరాలుగా మాదిగ దండోరా ఎస్సీ వర్గీకరణ ఉద్యమం జరుగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో ఎస్సి వర్గీకరణ బిల్లు పాసయిందన్నారు. ఎస్సి వర్గీకరణకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేయబోతోందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున సుప్రీంకోర్టు లో అఫిడవిట్ ఫైల్ చేయాలని కడియం అన్నారు.


సుప్రీంకోర్టులో జనవరి 17 నుంచి వర్గీకరణ కేసు వాదనలు చేయవలసి ఉందని, కొన్ని కారణాల వల్ల వాదన వాయిదా పడిందని ఆయన చెప్పారు. ఎస్సీ వర్గీకరణ బీజేపీ అమలు చేస్తుందని నమ్మకం లేదని, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఆర్డినెన్స్ తీసుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అడగడం సమంజసం అని కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు. కడియం శ్రీహరిగా నేను వర్గీకరణను ఏకీభవిస్తున్నానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు పాలించాలని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కడియం శ్రీహరి అన్నారు.


బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గంలో 1100 మంది దళిత బంధు లబ్దిదారులను ఎంపిక చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు లబ్ధిదారుల నిధులను ఫ్రీజ్ చేయడం సరికాదని ఆయన అన్నారు. ఫ్రీజ్ చేసిన లబ్ధిదారుల అకౌంట్లను వెంటనే ఆన్ ఫీజ్ చేయాలని కడియం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ఆభయ హస్తం పేరుతో ప్రతి లబ్దిదారుడికి 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిందని అన్నారు. దళిత బంధును కాంగ్రెస్ కొనసాగిస్తుందా అని ప్రశ్నించారు. అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని కొనసాగిస్తుందో లేదో స్పష్టం చేయాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. దళితబందు అక్రమాలపై విచారణ జరిపితే తమకు అభ్యంతరం లేదని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.