KTR Slams on Governor Speech in Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అభూత కల్పన, అసత్యాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) అన్నారు. నాలుగో రోజు అసెంబ్లీలో గవర్నర్ (Governor) ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రతిపాదించగా, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ బలపరిచారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడీ వేడీ చర్చ సాగింది. గవర్నర్ దారుణమైన ప్రసంగం విన్నాక రాష్ట్రం ఎలా ఉండబోతుందో అర్థం అవుతోందని కేటీఆర్ మండిపడ్డారు. తాము ఎక్కడ ఉన్నా ప్రజా పక్షమే అని, కాంగ్రెస్ పాలనలో తాగు, సాగు నీరు, కరెంట్ కు దిక్కు లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో 50 ఎకరాల రైతు అయినా సరే గుంపు మేస్త్రీలా ఉండేవారని ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లాలో ప్లోరోసిస్ తప్ప ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. అయితే, కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అంటే 2014 నుంచి మాత్రమే లెక్క వేయాలని భట్టి సూచించారు. పదేళ్లలో బీఆర్ఎస్ విధ్వంస పాలన సాగిందని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు ఇస్తే సాగతిస్తామని చెప్పారు. ఈ క్రమంలో పదేళ్ల పాలనపై కాంగ్రెస్ (Congress) చర్చ జరగాలి అంటే, 50 ఏళ్ల పాలనపై చర్చ జరగాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు.


మంత్రి పొన్నంపై ఆగ్రహం


గవర్నర్ ప్రసంగంలో అసత్యాలు తప్ప నిజాలు మాట్లాడలేదని కేటీఆర్ అనగా, మంత్రి పొన్నం అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో కేటీఆర్ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అధికారం ఉన్నా లేకున్నా మేము ప్రజాపక్షమే. తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిటికైనా విపక్షమే. ప్రజల తరఫున గొంతు విప్పుతాం. గతంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ప్రజలకు చూపెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది. పొన్నం ప్రభాకర్ తొలిసారి సభకు వచ్చారు. మంత్రి అయ్యారు. తొందర పడకండి. కేవలం క్రెడిట్ మాత్రమే మేం తీసుకుంటామంటే కుదరదు. ఆకలి కేకలు, కరెంట్ కోతలు, ఎన్కౌంటర్లు ఇవే కదా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అద్భుతాలు.' అంటూ కేటీఆర్ మండిపడ్డారు.


'ఆస్తులు సృష్టించాం'


పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశంలోని అగ్ర స్థానంలో నిలిచిందని కేటీఆర్ పునరుద్ఘాటించారు. తాము రూ.81 వేల కోట్లు అప్పు చేశామని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, రూ.1.37 కోట్ల ఆస్తులు సృష్టించి కొత్త ప్రభుత్వానికి అప్పగించామని చెప్పారు. విద్యుత్ ప్లాంట్లు, సాగునీటి ప్రాజెక్టులు కట్టి వ్యవసాయాన్ని పండుగ చేశామని తెలిపారు. భవిష్యత్తులో విద్యుత్ సామర్థ్యం 25 వేల మెగావాట్లకు చేరుతుందని స్పష్టం చేశారు. 


సీఎంపై విమర్శలు


ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపైనా కేటీఆర్ విమర్శలు చేశారు. తెలంగాణ నిర్లక్ష్యం కావడానికి కాంగ్రెస్ పాలకులే కారణమని అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. ఈ క్రమంలో 2014లో అసెంబ్లీలో రేవంత్ మాట్లాడిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. 'మా తండ్రి గారు చనిపోతే దహన సంస్కారాల అనంతరం స్నానం చేద్దామని వెళ్తే బావులు ఎండిపోయాయి. బోరు దగ్గరకు వెళ్తే కరెంట్ లేదు. నాకున్న పరిచయాలతో కరెంట్ వేయిస్తే నీళ్లు రాలేదు. నెత్తిమీద కాసిన్ని నీళ్లు చల్లుకుని ఇంటికి వచ్చాం.' అని రేవంత్ అన్నారని కేటీఆర్ పేర్కొన్నారు.


హామీలు అమలు చేయాలి


కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 కోసం ఎదురు చూస్తున్నారని, 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్, రైతుబంధు రూ.15 వేలు వంటి హామీలను అమలు చేయాలని, ఆటో డ్రైవర్లకు నెలకు రూ.1200 ఇస్తామన్నారని, ఇచ్చిన 6 గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తే స్వాగతిస్తామని అన్నారు. కాంగ్రెస్ కౌంట్ డౌన్ స్టార్ అయ్యిందని పేర్కొన్నారు.


Also Read: Medigadda Project: 'మేడిగడ్డ' ఘటనలో ఊహించని ట్విస్ట్ - పునరుద్ధరణ బాధ్యత ప్రభుత్వానిదేనని నిర్మాణ సంస్థ లేఖ