BRS MLA Harish Rao Comments on Congress 6 Guarantees: తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారని, ఈ లోపు పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే వాటి పరిస్థితి ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (HarishRao) ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చి 17తో వంద రోజులు పూర్తవుతాయని, అప్పట్లోగా దరఖాస్తులు తీసుకుని ఎన్నికల వరకూ లాగుతారని విమర్శించారు. ఆరు గ్యారెంటీల్లో మొత్తం 13 హామీలు అమల్లో ఉన్నాయని, ఇప్పటికీ 2 హామీలను మాత్రమే కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తోందని అన్నారు. 6 గ్యారెంటీల (6 Guarantees) మార్గదర్శకాలపై ప్రజల్లో పలు అనుమానాలు ఉన్నాయని, వాటిపై క్లారిటీ ఇవ్వాలని అన్నారు. గైడ్ లైన్స్ లేకుండా దరఖాస్తుల స్వీకరణ జరుగుతోందని, నిజానికి మొదట గైడ్ లైన్స్ ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని, ఇబ్బంది రాకూడదంటే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి మూడో వారంలోపు నిబంధనలు రూపొందించి ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.


అవి ఎగవేత పత్రాలా.?


కాంగ్రెస్ శ్వేతపత్రాలు హామీల ఎగవేత పత్రాలనే అనుమానం కలుగుతోందని హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వం గ్యారెంటీలకు సంబంధించి ఏం చేసినా ఫిబ్రవరి 20లోపే చేయాలన్నారు. రైతు బంధు నిధుల విషయంలో ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత లేదని అన్నారు. రైతులు పండించిన ధాన్యానికి బోనస్ ఇస్తామని మరో కీలక హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని, ఖరీఫ్ లో ఎలాగూ ఇవ్వలేదని.. యాసంగిలోనైనా ధాన్యానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటకు బోనస్ పై ఇప్పుడు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోకుంటే యాసంగిలో రైతులు నష్టపోతారని చెప్పారు. డిసెంబర్ 9 నాడే రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఆసరా పెన్షన్ల పెంపు, 200 యూనిట్ల లోపు విద్యుత్ బకాయిల మాఫీ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సభల్లో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అవి ఇంకా అమలు కాలేదనే ఆందోళనలో ప్రజలు ఉన్నారని చెప్పారు. అసెంబ్లీలో శ్వేతపత్రాలు ఇచ్చిన వారికి రైతు బంధు డబ్బులపై ప్రతి రోజూ ప్రెస్ నోట్ ఇవ్వడంలో ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచామన్నారని, అది ఎంత మందికి వర్తించిందో వివరాలివ్వాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ లో రూ.14 వేల కోట్ల అప్పులు తెచ్చుకున్నట్లు తెలిసిందన్నారు. గ్యారెంటీలు ఇచ్చినప్పుడు బడ్జెట్ గురించి కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదా అని ప్రశ్నించారు. గ్యారెంటీలపై ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిందేనని అన్నారు.


సీఎం స్థాయి వ్యక్తికి సరికాదు


సీఎం స్థాయి వ్యక్తి వాహనాలు దాచిపెట్టడం అని మాట్లాడడం సరి కాదని, ప్రభుత్వం దాచడం ఏం ఉంటుందని హరీష్ రావు ప్రశ్నించారు. బుల్లెట్ ప్రూఫ్ కోసం వాహనాలు ఎవరైనా విజయవాడకు పంపాల్సిందేనని, అవి సీఎం వాడుకోరా.?, ప్రభుత్వం వాడుకోదా.? అని నిలదీశారు. పలు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, నర్సాపూర్, జనగామ, హుజూరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వకుండా, ఓడిపోయిన కాంగ్రెస్ నేతలకు అధికారులు ఆహ్వానాలు పంపారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల్లోగా కాంగ్రెస్ గ్యారెంటీలకు మార్గదర్శకాలు ఇచ్చి జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


Also Read: Minister Komati Reddy: 'వేగమొకడు, త్యాగమొకడు గతం మరువని గమనమే' - 'సలార్' సాంగ్ తో మంత్రి కోమటి రెడ్డి ఆసక్తికర ట్వీట్స్