కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టి తమను గెలికిందని బీఆర్ఎస్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఇలా తమను గెలికి తిట్టించుకోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద గురువారం (డిసెంబర్ 21) ఆయన మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆత్మరక్షణలో పడిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను, ఇచ్చిన హామీలను, పథకాలను ఆలస్యంగా అమలు చేయడం కోసం లేదా ఎగ్గొట్టడం కోసం ఈ శ్వేతపత్రాలను తెరపైకి తీసుకొచ్చారని అన్నారు.
ప్రభుత్వ అప్పులు బయటపడితే భవిష్యత్తు ఇబ్బంది అవుతుందని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. హరీశ్ రావు, కేటీఆర్‌ల మాటలకు మంత్రుల కౌంటర్లు సరిపోవడం లేదని అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో మంత్రులు, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు మాజీ మంత్రి హరీశ్ రావు ఉతికి ఆరేస్తున్నారని అన్నారు. మంత్రులు అసలు విషయాలు మాట్లాడకుండా.. పైపైన మాట్లాడి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పదవి అనేది రేవంత్ రెడ్డి చిరకాల వాంఛ అని, ఆ పదవిని ఆయన అంత ఈజీగా వదులుకోబోరని వ్యాఖ్యానించారు. ఆయన టార్గెట్ పెట్టుకొని మరీ సీఎం అయ్యారని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్లు రిటైర్ అవుతారని తాను రెండేళ్ల క్రితమే చెప్పానని అన్నారు.
కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ తమకు చెప్పారని వివరించారు. తమ ఎమ్మెల్యేలు కొందరు ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నారని.. ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందనడం సరికాదని అన్నారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని చెప్పారు.