Ex MP Vinod Kumar: బోయిన్‌పల్లి సరిత... జెన్‌కోలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. మాజీ జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు ఈమెకు ఉద్యోగం ఇప్పించినట్టు ఆరోపణలు  వస్తున్నాయి. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్న బిడ్డే... బోయినపల్లి సరిత రావు అని. తెలంగాణ జెన్‌కోలో పరీక్ష రాయకుండానే ఆమెకి ఏఈ (అసిస్టెంట్  ఇంజనీర్) ఉద్యోగం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. జెన్‌కో చైర్మన్‌గా ప్రభాకర్ రావే ఆమెకు ఈ ఉద్యోగం ఇచ్చారని... ఆమె ఉద్యోగానికి రాకుండా ఇంట్లోనే ఉంటూ నెలకి లక్షా  50వేల రూపాయల జీతం తీసుకుంటుందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. 


ఇదంతా కాంగ్రెస్‌, బీజేపీల పనే అంటున్నారు మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌. బోయినపల్లి సరితకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇంటిపేరు ఒకటే ఉన్నంత  మాత్రాన బంధువులు అయిపోతారా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌ బీజేపీ కార్యకర్తలతో తనపై తప్పుడు  ప్రచారం చేయిస్తున్నారని సీరియస్‌ అయ్యారు.


మాజీ జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు ఉద్యోగం ఇచ్చినట్లుగా చెబుతున్న బోయినపల్లి సరితకు తనకు ఎలాంటి బంధుత్వం లేదని క్లారిటీ ఇచ్చారు కరీంనగర్ మాజీ ఎంపీ  బోయినపల్లి వినోద్ కుమార్. కావాలనే దీనిని బీజేపీ, కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేశారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయి కనుకే తనపై చీప్‌ ట్రిక్స్‌తో ప్రచారం చేస్తున్నారని  వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. ఒక వార్త ప్రచురించే ముందు సమగ్ర సమాచారం తెలుసుకోవాలని చెప్పారు. తన 20ఏళ్ల రాజకీయంలో ఏనాడు తప్పును ప్రొత్సహించలేదని..  చట్ట వ్యతిరేక పని చేయలేదన్నారు. బండి ‌సంజయ్ తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే గోబెల్స్ ప్రచారం అపాలన్నారు. ఆ అమ్మాయి తన బంధువు  అని రుజువు చేయగలరా? అని ఆయన ప్రశ్నించారు మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌.


మరోవైపు.. సరితకు జెన్‌కో సీఎండీ ఇచ్చిన ఉద్యోగం విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బోయిన్‌పల్లి వినోద్ కుమార్ అన్న కుమార్తెగా మెసేజ్‌లు కనిపిస్తున్నాయని.. ఇవి అబద్ధాలని.. వార్తలు రాస్తున్న నెటిజెన్లపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. వినోద్ కుమార్‌కు, ఆయన కుటుంబానికి మచ్చ తెచ్చేలా సోషల్ మీడియాలో పోస్టింగులు ఉన్నందున వారిపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ టూటౌన్ పోలీసులకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఫిర్యాదు చేసింది. ఇంజినీరింగ్ కోర్సు పూర్తికాకపోయినా ఆమెకు ఉద్యోగం ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలను వెలికితీసి ఉల్లంఘనలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.