Bopparaju On AP Govt: వైసీపీ ప్రభుత్వం తీరుతో రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల ఉద్యోగులంతా తీవ్ర ఆందోళనతో ఉన్నారని.. ఏపీ ఐకాస ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే హామీలను ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. విజయవాడలోని ఏపీ పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయం వద్ద ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగులు తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ.. గతంలో పేర్కొన్న విధంగా ఉద్యమ కార్యాచరణ ప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈనెల 20వ తేదీ వరకు అన్ని ప్రభుత్వం కార్యాలయాల్లో ఆందోళన కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర నాయకత్వం నచ్చజెప్పినా ఉద్యోగులు అంగీకరించడం లేదని.. తిరిగి తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని బొప్పరాజు తెలిపారు. ప్రభుత్వం జీతాలే చెల్లించలేని పరిస్థితుల్లో ఉందని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గితే బకాయిలు ఇస్తుందనే నమ్మకం లేదని చెప్పారని వివరించారు.


ఉద్యమాన్ని కొనసాగించాలని, ఏమాత్రం అవసరం అనుకున్నా కార్యాచరణనను తీవ్రతరం చేయాలనే సూచనను రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వ్యక్తం అయిందని ఆయన తెలిపారు. అందుకే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ఈ నెలాఖరులోగా చట్టబద్ధంగా తమకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. 


నిన్ననే ఉద్యమ ప్రణాళికను కొనసాగిస్తున్నట్లు ప్రకటన 


ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల ఆందోళన చిన్న చిన్న మార్పులతో కొనసాగుతుందని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ప్రభుత్వంతో పలు దఫాలుగా జరిగిన చర్యల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. గురువారం నుంచే  ఉద్యోగుల కార్యచరణ ప్రణాళిక ప్రకారం ఆందోళనలను నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఏపీ జేఏసీ అమరావతి నాయకులు పలు దఫాలుగా చర్చలు జరిపారు.  ఆయన పలు ప్రతిపాదనలు తెర మీదకు తీసుకురావటం, మరి కొన్ని డిమాండ్ల పై సానుకూల ప్రకటన చేయటంతో, ఉద్యమం కొనసాగించాలా వద్దా..అనే దాని పై అమరావతి జేఎసి ఎగ్జిక్యూటివ్ కమిటి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జేఎసి నాయకులు పలు అంశాలను చర్చించిన తరువాత భవిష్యత్ కార్యచరణ పై చర్చించారు. 


ఉద్యోగుల ఆర్ధిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం, మంత్రుల కమిటి ఇప్పటికే క్లారిటి ఇచ్చింది. తాము ఇచ్చిన వినతిపత్రం పై చర్చ చేయకుండా పాత సమస్యలపై మాట్లాడుతున్నారని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తామని చెప్పారని, అయితే దాని పై ఇంత వరకు క్లారిటి లేదని బొప్పరాజు పేర్కొన్నారు. చట్టబద్ధంగా ఉద్యోగులకు రావాల్సిన 2 వేలకోట్లు సెప్టెంబర్ లోపు చెల్లిస్తామని, డిఎ, ఏరియర్స్ ఎంత ఇవ్వాలి అన్నది స్పష్టత ఇవ్వకపోవటం వెనుక అంతర్యం ఎంటని ఆయన ప్రశ్నించారు. తాము చెప్పిన అంశాల  పై చర్చ లేకుండా వాళ్ళు చెప్పాలనుకున్నవి చెప్పి వెళ్లిపోయారని ..11వ పిఆర్సీ, పే స్కెల్ పై స్పష్టత లేకుండా ఉందని, ఎంత ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.