Warangal News: గత వారం, పది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వాళ్ల వరకు చాలా మంది గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. ముఖ్యంగా టీనేజర్స్ నుంచి 40 ఏళ్ల వయసు వరకున్న వాళ్లు ఎక్కువగా మృత్యు ఒడికి చేరుతున్నారు. తాజాగా ఓ వృద్ధుడు బస్టాండులోనే గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విషయం గుర్తించిన స్థానికులు, ట్రాఫిక్ సిబ్బంది సీపీఆర్ చేశారు. అయినప్పటికీ వృద్ధుడి ప్రాణాలు దక్కలేదు. 


అసలేం జరిగిందంటే..?


వరంగల్ జిల్లా కేంద్రంలో విషాధం చోటు చేసుకుంది. వరంగల్ బస్టాండ్ ఆవరణలో ఓ వృద్ధుడు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి పడిపోయాడు. విషయం గుర్తించిన స్థానికులు ట్రాఫిక్ సీఐ బాబు లాల్ కి సమాచారం అందించగా.. బస్టాండ్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రామారావు విషయం తెలిపారు. వెంటనే అప్రమత్తమైన ఎస్ఐ సిబ్బందిని తక్షణమే సంఘటన స్థలానికి పంపించారు. అక్కడే ఉన్న వైద్య విద్యార్థిని సహా ట్రాపిక్ పోలీసులు తీవ్రంగా శ్రమించి అత్యవసర చికిత్స నిమిత్తం సీపీఆర్ చేశారు. అంతకు ముందే అంబులెన్స్ కు కూడా సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అంబులెన్స్ సిబ్బంది వృద్ధుడిని ఎంజీఎం తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు వివరించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతుడి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మరోవైపు వృద్ధుడికి గుండెపోటు వచ్చినట్లు గుర్తించి... అత్యవసరంగా సీపీఆర్ చేసిన వైద్య విద్యార్థినితో పాటు ట్రాఫిక్ పోలీసులను స్థానికులు ప్రశంసించారు.



 నాలుగు రోజుల క్రితమే కెనడాలో మృతి చెందిన తెలంగాణ వైద్య విద్యార్థి


మొన్నటి వరకూ ఇక్కడే ఉండి చదువుకుంది. ఉన్నత చదువుల కోసం నెల రోజుల క్రితం కెనడా వెళ్లింది. బాగా చదివి.. డాక్టర్ గా తిరిగిరావాలనుకున్న ఆమె కల.. కల్లలాగే మిగిలిపోయింది. గుండెపోటుతో పోయిన నెలరోజులకే మృతి చెందింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చేతికి అంది వచ్చిన బిడ్డ చనిపోవడంతో తట్టుకోలేకపోతున్నారు. 


కెనడా వెళ్లి నెల రోజులు గడవకముందే.. గుండెపోటు


నిజాబామాబాద్ జిల్లా మల్కాపూర్(ఏ) గ్రామ సర్పంచి వెంకటరెడ్డికి ఇద్దరు కుమారులు అరుణ్ రెడ్డి, భరత్ రెడ్డి, కుమార్తె పూజితా రెడ్డి ఉన్నారు. పెద్ద కుమారుడు కెనడాలో స్థిరపడ్డాడు. అలాగే పూజితా రెడ్డి ఖమ్మంలోని ఓ ప్రైవేటు వైద్య కళాఆలలో బీడీఎస్ పూర్తి చేశారు. పీజీ చేసేందుకు జనవరి 26వ తేదీన కెనడా వెళ్లింది. సోదరుడు అరుణ్ రెడ్డి ఇంట్లో వారం ఉండి.. అనంతరం స్నేహితులతో కలిసి యూనివర్సిటీ హాస్టల్ లో చేరింది. పది రోజుల కిందట హాస్టల్ లో ఉండగా.. ఉన్నట్టుండి ఆమెకు గుండెపోటు వచ్చింది. అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. విషయం గుర్తించిన తోటి విద్యార్థులు, సిబ్బంది ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్సపొందుతూ పూజితా రెడ్డి మృతి చెందింది. 
అయితే అక్కడే ఉన్న పూజిత సోదరుడు ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చాడు. అక్కడే అంత్య క్రియలు నిర్వహించారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి కన్నుమూసిన కుమార్తెను చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.