YS Viveka Case:  వైఎస్‌ వివేక హత్య కేసులో తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సీబీఐను నిలువరించాలని కోరుతూ వైఎస్ అవినాష్ రెడ్డి వేసిన రిటిష్‌ పిటిషన్‌ విచారణలో ట్విస్ట్ కనిపిస్తోంది. ఇందులో వైఎస్ వివేక కూతురు సునీత ఇంప్లీడ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.


తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసినందుకు తన వాదన కూడా వినాలంటూ అవినాష్‌ రెడ్డి వేసిన రిట్‌ పిటిషన్‌లో వివేక కుమార్తె సునీత ఇంప్లీడ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.  కాసేపటి క్రితమే ఆమె కోర్టుకు చేరుకున్నారు. అవినాష్ రెడ్డి పిటిషన్ విచారణ సందర్భంగా తనను ఇంప్లీడ్ చేయాలని సునీత కోరనున్నారు. అవినాష్ రెడ్డి తన పిటిషన్ లో సునితపై వ్యక్తిగత అంశాలు పేర్కొనడంపై తన వాదన వినాలని సునీత కోరనున్నారు.


వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను అరెస్ట్  చేయకుండా సీబీఐకి ఆదేశాలివ్వాలని కోరుతూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఇందులో చాలా అంశాలను ప్రస్తావించారు. దస్తగిరి అక్కడ ఇక్కడ విని చెప్పిన మాటల ఆధారంగానే..సీబీఐ విచారణ కొనసాగుతోందన్నారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ..ఈ కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. 


సునీల్ యాదవ్ గూగుల్ టేక్ఔట్ ఫోన్ సిగ్నల్ లొకేషన్ చూపి సిబిఐ తనను వేధిస్తోందని.. స్పాట్ లో దొరికిన లేఖపై సిబిఐ దర్యాప్తు చేయటం లేదన్నారు.  వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారి పనితీరు పక్షపాతంగా ఉందని..  వివేకా హత్య ఎలా జరిగిందో ముందుగానే నిర్ణయించుకొని..అదే కోణంలో విచారణ చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా విచారణాధికారి కొందరిపై ఒత్తిడి తెస్తున్నారని..  తాను విచారణలో చెప్పిన విషయాలను కూడా విచారణ అధికారి మార్చేస్తున్నారని  అవినాష్‌రెడ్డి ఆరోపించారు. నోటీస్ దశలో విచారణ సాగుతుండగా చార్జ్ షీట్‌లో నేరస్తునిగా సిబిఐ చిత్రీకరిస్తోందన్నారు.  


సునీత ఫ్యామిలీకి వివేకకు విభేదాలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. వివేక వేరే పెళ్లి చేసుకోవడంతోనే గొడవలు మొదలయ్యాయని తెలిపారు. వివేక హత్య జరిగక ఐదారేళ్ల ముందు నుంచే వివాదాలు ఉన్నాయని ఆరోపించారు. ఆ యాంగిల్‌లో సీబీఐ విచారణ చేయడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఆరోపణలు అవినాష్ చేసినందునే తన వాదన కూడా వినాలని సునీత కోరనున్నట్టు తెలుస్తోంది. 


ఇప్పటికే ఈ కేసులో అవినాష్‌ రెడ్డిని రెండుసార్లు విచారించిన సీబీఐ ఇవాళ మూడోసారి విచారిస్తోంది. సిబిఐ అధికారులు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే జనవరి 28న, ఫిబ్రవరి 24న రెండుసార్లు అవినాష్ రెడ్డిని విచారించారు.


అరెస్ట్ ఊహాగానాలతో ఎంపీ ముందు జాగ్రత్త ప్రయత్నాలు ! 


సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ ను బట్టి చూస్తే.. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి విషయంలో సీబీఐ చాలా దూకుడుగా విచారణ జరిపిందని.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవచ్చని కూడా చెబుతున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది.