చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చే బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదించాలని కవిత దీక్ష బూనారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆమె ఒక్కరోజు దీక్షకు దిగారు. దీనికి జాతీయ, రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభించింది. భారీ సంఖ్యలో మహిళా నేతలు వచ్చి దీక్షలో కూర్చున్నారు. వేదికపై పలువురు జాతీయ నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు కవిత. 


కవిత చేస్తున్న దీక్షకు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి మద్దతు తెలిపి దీక్షను ప్రారంభించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు సాధనలో బీఆర్‌ఎస్‌ నేత చేస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు.


దీక్ష ప్రారంభం సందర్భంగా మాట్లాడిన కవిత... బీజేపీకి నిజంగా మహిళలపై ప్రేమ, వారి ఎదుగుదలపై చిత్తశుద్ధి ఉంటే మాత్రం వెంటనే పార్లమెంట్‌లో మహిళా బిల్లుకు ఆమోదం తెలిపాలని డిమాండ్ చేశారు. పూర్తి మెజార్టి ఉన్న వేళ ఆ ప్రక్రియను వెంటనే చేపట్టాలన్నారు. అలా ఆమోదించి వరకు బీజేపీని వెంటాడుతామన్నారు. అప్పటి వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 






బీల్లు ఆమోదించేందుకు బీజేపీ ముందుకు వస్తే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయన్నారు కవిత. చాలా కాలంగా ఇది పెండింగ్‌లో ఉందని ఇప్పుడైనా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారామె. 1996 దేవెగౌడ హయాంలో పార్లమెంట్‌ ముందుకు వచ్చిన బిల్లుకు నేటికీ మోక్షం లభించకపోవడం చాలా బాధాకరమన్నారు.


భారీగా బీఆర్‌ఎస్‌ లీడర్లు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ దీక్ష సాయంత్రం నాలుగు గంటల వరకు సాగనుంది.