పాదాలు, చీలమండ, కాళ్ళలో వాపుగా అనిపిస్తుందా? వాటి మీద ఒత్తిడి పడినప్పుడు డింపుల్ పడుతుందా? అయితే మీ కిడ్నీలు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాయని అర్థం. ఒక్కోసారి కళ్ళు కూడా ఉబ్బిపోయి కనిపిస్తాయి. ఇది కూడా మూత్రపిండాల వ్యాధికి సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. సుమారు 30 శాతం మంది కిడ్నీ రోగులు చాలా ఆలస్యంగా డాక్టర్ ని సంప్రదిస్తున్నారు. దీని వల్ల కిడ్నీలు అప్పటికే ప్రమాదకర పరిస్థితికి చేరుకుంటున్నాయి. ఫలితంగా  డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి చేయాల్సి వస్తుంది.


కిడ్నీ వ్యాధిని గుర్తించడం ఎలా?


హైబీపీ, డయాబెటిక్ రోగులకు తరచుగా కిడ్నీ సమస్యలు వస్తాయి. ఎందుకంటే హైబీపీ రక్త నాళాలు సంకోచిస్తాయి. ఇవి చివరికి వాటిని దెబ్బతీయడం లేదా బలహీనపడేలా చేస్తుంది. డయాబెటిక్ రోగుల్లో రక్తంలోని అదనపు చక్కెర తొలగించడం కోసం మూత్రపిండాలు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. అప్పుడు కిడ్నీల మీద ఒత్తిడి అధికంగా ఉంటుంది. మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం వెనుక మరొక కారణం శరీరం నీటిని నిలుపుకోవడం. కాళ్ళు, చీలమండలు, పాదాలలో నీరు అధికంగా చెరినప్పుడు వాపు కనిపిస్తుంది. మూత్రపిండాల వ్యాధిలో కనిపించే అత్యంత సాధారణ లక్షణాల్లో పాదాల వాపు ఒకటి. గురుత్వాకర్షణ వల్ల నీరు పాదాల్లోకి చేరుతుంది. కొంతమందిలో కాసేపటికి సాధారణ స్థితికి చేరుతుంది కానీ కిడ్నీ వ్యాధి వచ్చే వారిలో మాత్రం అది దీర్ఘకాలిక నష్టాన్ని కలిగిస్తుంది.


నెఫ్రాన్ కి నష్టం వాటిల్లడం వల్ల రక్తంలో ప్రోటీన్ అల్బుమిన్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో శరీరంలో ద్రవం పేరుకుపోతుంది. ఫలితంగా వాపుకి కారణమవుతుంది. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటే అల్బుమిన్ మూత్రంలోకి ప్రవేశించదు. శరీరంలో నీటిని నిలుపుకోవడం అనేది నెఫ్రోటిక్ సిండ్రోమ్, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి లక్షణాలు.


కిడ్నీ వ్యాధి నిర్థారణ పరీక్షలు


మూత్రపిండాల వ్యాధులని గుర్తించేందుకు రెండు రకాల పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. రక్తపరీక్ష చేస్తారు. క్రియేటినిన్ చూస్తారు. అది పెరిగిందంటే మూత్రపిండాల పనితీరు సరిగా లేదని అర్థం. మరొకటి మూత్ర పరీక్ష. మూత్రంలో అల్బుమిన్ స్థాయిలు చూస్తారు. కాళ్ళలో ద్రవం పేరుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. వెంటనే వైద్యులని సంప్రదించడం ముఖ్యం. కిడ్నీ వ్యాధికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి యూరిన్ టెస్ట్, అల్ట్రా సౌండ్ వంటి కొన్ని సాధారణ పరీక్షలు కూడా చేస్తారు.


యూరిన్ రంగుని బట్టి కూడా కిడ్నీల పనితీరు తెలుసుకోవచ్చు. యూరిన్ చెడు వాసన వస్తే ఇన్ఫెక్షన్ చేరిందని అర్థం శరీర అంతర్గత భాగాల్లో రక్తస్రావం కావడం వల్ల ఎరుపు రంగులోకి మూత్రం వస్తుంది. అలా ఉంటే కిడ్నీలో రాళ్ళు లేదా ఇన్ఫెక్షన్ వచ్చినట్టే. ముదురు గోధుమ రంగులోకి మారితే మాత్రం అది చాలా ప్రమాదకరం. గోధుమ రంగు మూత్రాశయం లేదా మూత్రపిండాల క్యాన్సర్ కి మొదటి సంకేతం. అందుకే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ద్రవాలు బాగా తీసుకోవాలి. రోజుకి కనీసం 2, 3 లీటర్ల నీటిని తాగాలి. అతిగా తాగినా కూడా కిడ్నీలు దెబ్బతింటాయి.   


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: 4 నిమిషాలకో మరణం - ఇండియాను వణికిస్తున్న ప్రాణాంతక సమస్య, కలవరపెడుతోన్న ఎయిమ్స్ స్టడీ