Bombay High Court:


రోడ్లపై ఫుడ్ పెట్టొద్దు: ధర్మాసనం


వీధికుక్కల బెడదను తగ్గించేందుకు బాంబే హైకోర్టు (Bombay High Court) కీలక ఆదేశాలిచ్చింది. "రోడ్లపైనా, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ వీధి కుక్కలకు (Stray Dogs) ఆహారం అందించిన వాళ్లకు రూ.200 వరకూ జరిమానా విధించండి" అని నాగ్‌పూర్ ధర్మాసనం తేల్చి చెప్పింది. జస్టిస్ సునీల్ షుక్రే, జస్టిస్ అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. నాగ్‌పూర్‌లో వీధికుక్కల సమస్యను తీర్చేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపడుతున్నా...ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు. కొందరు రోడ్లపైనే కుక్కలకు ఫుడ్ పెడుతుండటం వల్ల గుంపులు గుంపులుగా వచ్చి చేరుతున్నాయని...ఫలితంగా స్థానికులకు సమస్యలు తలెత్తుతున్నాయని ధర్మాసనం గుర్తించింది. అందుకే...ఈ తీర్పునిచ్చింది. ఒకవేళ వాటికి ఆహారం పెట్టాలనుకుంటే...ఇంటికి తీసుకెళ్లాలని ధర్మాసనం సూచించింది. లేదంటే వాటిని దత్తత తీసుకోవాలని తెలిపింది. 


పూర్తి బాధ్యతలు తీసుకోండి: హైకోర్టు


"కొందరు తమకు కుక్కల పట్ల ఎంతో ప్రేమ, జాలి చూపిస్తూ ఫుడ్ ప్యాకెట్స్‌ అందిస్తున్నారు. కానీ...అలా చేయటం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్నది మాత్రం ఆలోచించటం లేదు. వాటిని ఎంత మచ్చిక చేసుకున్నప్పటికీ ఒక్కోసారి క్రూరంగా మారిపోతాయి. పిల్లలపై ఉన్నట్టుండి దారుణంగా దాడి చేస్తాయి" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిజంగా వాళ్లకు వీధికుక్కలపై అంత ప్రేమ ఉంటే దత్తత తీసుకుని పెంచుకోవాలని సూచించింది. వాటికంటూ ప్రత్యేకంగా ఓ షెల్టర్ ఏర్పాటు చేయాలని తెలిపింది. వాటి రిజిస్ట్రేషన్‌కు అవసరమైన ఖర్చుని భరించడమే కాకుండా...వాటి ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని వెల్లడించింది. "కేవలం ఆహారం అందించటం మాత్రమే ప్రేమ కాదు. వాటి పూర్తి బాధ్యతలు తీసుకుని రక్షించాలి. కానీ...అలా వాటికి ఎక్కడ పడితే అక్కడ ఆహారం అందిస్తూ పోతే వాటి సంతతి అలా పెరుగుతూ పోతుంది. ఇదెంతో ప్రమాదకరం" అని వెల్లడించింది. ఇకపై నాగ్‌పూర్‌ సిటీ వాసులెవరూ రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో వీధికుక్కలకు ఫుడ్ అందించకూడదని తేల్చి చెప్పింది. మహారాష్ట్ర పోలీస్ యాక్ట్‌ (Maharashtra Police Act) సెక్షన్ 44 ప్రకారం వీధి కుక్కల సంతతిని కట్టడి  చేసే అధికారం ఉందని పేర్కొంది. ఈ అంశాన్నీ సీరియస్‌గా తీసుకోవాలని, నిబంధన ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలిచ్చింది బాంబే హైకోర్టు. 


పిట్‌బుల్‌పై నిషేధం..


ఈ మధ్య కాలంలో కుక్కలు దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్న ఘటనలు చాలానే జరుగుతున్నాయి. యూపీలోనే వరుసగా రెండు మూడు సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అప్పుడే..."పిట్‌బుల్" (Pitbull) జాతి కుక్కల్ని నిషేధించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. కొన్ని రోజులు ఈ హడావుడి చేసినా...తరవాత ఈ అంశం సద్దుమణిగింది. అయితే...యూపీలోని ఘజియాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం దీన్ని సీరియస్‌గా తీసుకుంది. పిట్‌బుల్, రాట్‌వీలర్, డాగో అర్జెంటీనో జాతులకు చెందిన కుక్కల్ని పెంచుకోవడాన్ని నిషేధించింది. ఇక మిగతా శునకాలు పెంచుకోవాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాలని తేల్చిచెప్పింది. నవంబర్ 1వ తేదీ నుంచి లైసెన్స్‌లు జారీ చేయనున్నట్టు తెలిపింది. మరో రూల్ ఏంటంటే...ఒకటి కన్నా ఎక్కువ కుక్కల్నీ పెంచుకోకూడదు. కాంప్లెక్స్‌లలో నివసించే వాళ్లు తమ కుక్కల్ని సర్వీస్‌ లిఫ్ట్‌లో తీసుకురావాలని, అలా బయటకు తీసుకొచ్చిన సమయంలో వాటి మూతికి తప్పనిసరిగా ముట్టెలు(నోరు తెరవకుండా కట్టేయటం) పెట్టాలని ఆదేశించింది.


Also Read: Gujarat Election 2022: రెండు విడతలుగా గుజరాత్ ఎన్నికలు? ఈ నెలాఖరులో తేదీలు ప్రకటించే అవకాశం!