APSRTC Digital Payments : నోట్ల రద్దు, కరోనా పరిస్థితుల తర్వాత దేశంలో డిజిటల్ పేమెంట్స్ వాడకం పెరిగింది. క్యాష్ లెస్ పేమెంట్స్ వైపు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆన్ లైన్ పేమెంట్స్ అమల్లోకి రావడంతో ఆ దిశగా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. బస్సు ప్రయాణాల్లో నగదు, చిల్లర సమస్యలను పరిష్కరించేందుకు డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. యూనిఫైడ్ టిక్కెటింగ్ సొల్యూషన్ పేరిట డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌ పే వంటి యూపీఐ పేమెంట్స్ ద్వారా బస్సు టికెట్‌ను కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది. 


విశాఖలో మొదటిగా 


డిజిటల్ చెల్లింపుల విధానాన్ని మొదటిగా విశాఖ జిల్లాలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.  విశాఖ నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే డీలక్స్, సూపర్ లగ్జరీ, గరుడ, అమరావతి సర్వీసుల్లో డిజిటల్ పేమెంట్స్ అమల్లోకి తీసుకొచ్చినట్లు ప్రకటించారు. త్వరలోనే విశాఖ జిల్లా వ్యాప్తంగా అన్ని బస్సుల్లో యూపీఐ పేమెంట్స్‌ను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.  రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు చేస్తామని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.  


ఈ-పోస్ పరికరాలు 


రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల ఇచ్చేందుకు ప్రత్యేక రూపొందించిన టిమ్స్ పరికరాలు ఉపయోగిస్తున్నారు. త్వరలో వీటి స్థానంలో ఈ-పోస్ యంత్రాలను అందిస్తామని అధికారులు అంటున్నారు.  విశాఖపట్నం జిల్లాకు 180 ఈ-పోస్ మిషన్లు అందించారు.  వీటి వినియోగంపై ఇప్పటికే డ్రైవర్లు, కండక్టర్లకు తగిన శిక్షణ ఇచ్చారు.  ప్రస్తుతానికి బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్‌ చేసేవారు 10 శాతంగా ఉండగా ఆ సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. 


ఆర్టీసీలో ప్రయాణిస్తే బహుమతులు


ఆర్టీసీలో ప్రయాణం చేయండి బహుమతులు పొందండి అంటూ అధికారులు ప్రచారం చేపట్టారు.  అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆర్టీసీ డిపోలో పల్లె వెలుగు బస్సులలో ప్రయాణించే వారికి ఆ ఆఫర్ వర్తిస్తుంది. జిల్లాలో నాలుగు డిపోలలో అమలాపురం నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులలో గిఫ్ట్స్ బాక్స్ ఏర్పాటు చేశారు అధికారులు. ప్రయాణికులు బస్సు దిగే ముందు తమ టికెట్‌పై పేరు, ఫోన్‌ నంబర్‌ ఇతర వివరాలు చేసి బస్సులో ఏర్పాటు చేసిన గిఫ్ట్ బాక్స్ లో ఆ టికెట్ ను వేయాలి.  ఆ బాక్సులో వేసే టికెట్ల నుంచి అధికారులు లక్కీ డిప్ తీస్తారు. ఆ లక్కీ డిప్‌ ద్వారా విజేతలను ఎంపిక చేసి వారికి బహుమతులు అందిస్తామని తెలిపారు.