Midnapore Bomb Blast:


భారీ పేలుడు 


పశ్చిమ బెంగాల్‌లో సంచలన సంఘటన చోటు చేసుకుంది. మిద్నాపూర్‌లోని భూపతినగర్‌లో టీఎమ్‌సీ నేత రాజ్‌కుమార్ ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీఎమ్‌సీ నేత అభిషేక్ బెనర్జీ మీటింగ్‌కు ముందు ఈ ప్రమాదం జరగడం సంచలనమైంది. తృణమూల్ బూత్‌ ప్రెసిడెంట్ మృత దేహాన్ని సంఘటనా స్థలానికి అర కిలోమీటర్ దూరంలో కనుగొన్నారు. అంటే...పేలుడు తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రాథమికంగా... నాటుబాంబుతో ఇంటిని పేల్చారని వెల్లడైంది. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పేలుడు జరిగిన తరవాత ఇల్లు దారుణంగా ధ్వంసమైంది. దీనికి సంబంధించిన ఫోటోలూ వైరల్ అవుతున్నాయి. రాత్రి 11 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించిందని పోలీసులు వెల్లడించారు. ఉన్నట్టుండి గట్టి శబ్దం వినిపించడం వల్ల స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. ఈ ప్రమాదంపై రాజకీయాలూ మొదలయ్యాయి. బీజేపీ నేతలు విమర్శలు ఎక్కు పెడుతున్నారు. TMC నేత రాజ్‌కుమార్ ఇంట్లో నాటు బాంబులు తయారు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని..ఆ సమయంలో అలజడి సృష్టించేందుకే ఈ బాంబులు తయారు చేస్తున్నారంటూ బీజేపీ మండి పడుతోంది. NIA నేతృత్వంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ప్రజలు ఆందోళన  చెందుతున్నారు. బూత్ ఛైర్మన్ రాజ్‌కుమార్‌తో పాటు మరో కార్యకర్త విశ్వజిత్ గ్యాన్‌ మృత దేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టంకు తరలించారు. ఇప్పటి వరకూ పోలీసుల నుంచి కానీ.. అటు టీఎంసీ నుంచి ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. 






ప్రభుత్వం కూలిపోతుంది: బీజేపీ 


 బంగాల్‌లో మమతా బెనర్జీ సర్కార్‌ త్వరలోనే కూలిపోతుందని భాజపా సంచలన వ్యాఖ్యలు చేసింది. డిసెంబర్‌ తర్వాత దీదీ సర్కార్ ఉండదని భాజపా అసన్సోల్ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ మంగళవారం అన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని పడగొట్టే పెద్ద ఎత్తుగడ తమ పార్టీ దగ్గర ఉందని ఆమె అన్నారు. 


" డిసెంబరులో ఇక్కడ 'ఖేలా' (ఆట) ఉంటుంది. 30 మందికి పైగా టీఎంసీ ఎమ్మెల్యేలు మా పార్టీతో కాంటాక్ట్‌లో ఉన్నారు. డిసెంబర్ తర్వాత తమ ప్రభుత్వం ఉండదని వారికి తెలుసు. మేము మా వ్యూహాన్ని ప్రకటించం. కానీ ఏదో ఒకటి జరుగుతుంది. డిసెంబర్‌లో పెద్ద ఖేలా ఉంటుందని మా నాయకత్వం పదేపదే చెబుతోంది. బంగాల్‌ ఆర్థిక అత్యవసర పరిస్థితి వైపు వెళ్తుంది. ఇది దివాలా తీసిన ప్రభుత్వం. వారి వద్ద డబ్బు లేదు. ఎలా ఉంటుంది? వారు పని చేస్తారా? రాష్ట్రాన్ని నడుపుతున్న వారిలో 50 శాతం మంది జైలులో ఉన్నారు, మిగిలిన వారు కూడా వెళ్తారు, అప్పుడు ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు?                          "
-      అగ్నిమిత్ర పాల్, భాజపా ఎమ్మెల్యే


బంగాల్ భాజపా అధ్యక్షుడు సుకాంత మజుందార్ కూడా కొన్ని వారాల క్రితం ఇదే వాదన చేశారు. మమతా బెనర్జీని త్వరలో అరెస్టు చేస్తామని, 40 మందికి పైగా టీఎంసీ నేతలు తమ పార్టీని సంప్రదించారని చెప్పారు.


Also Read: కన్న ప్రేమను కమ్మేసిన కరోనా - డబ్బు కోసం కన్నబిడ్డలతో పాడు వీడియోలు చేయించిన తల్లి