Bolivia expelled Nithyananda men: నిత్యానంద ఇటీవల సజీవ సమాధి అయ్యారన్న ప్రచారం జరిగింది.కానీ  ఆయన ఇలా ప్రచారం చేసుకున్నారని ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఆయన బొలివీయాలో భూముల్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. బొలీవియాలోని భూములను తేలిగ్గా చేజిక్కించుకునేందుకు నిత్యానంద అనుచరులు చేసిన కుట్రల్ని అక్కడి ప్రభుత్వం కనిపెట్టింది.  బొలీవియా స్థానిక తెగలతో భూమి లీజుకు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు నిత్యానంద మనుషులు ప్రయత్నించారు.  ఈ విషయం వెలుగులోకి రావడంతో బొలీవియా ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు 20 మంది నిత్యానంద అనుచరుల్ని అరెస్టు చేసింది. వారిని దేశం బయటకు పంపేసింది.                             

బొలీవియాలో ఇటీవల ఓ కార్చిచ్చు ఏర్పడింది. ఈ  కార్చిచ్చు సమయంలో స్థానిక ప్రజలకు కొంత మంది సహాయం చేశారు. ఆ తరువాత వారు అక్కడి భూములను కొనేందుకు ప్రయత్నించారు.  స్థానిక తెగలను మభ్యపెట్టి భూములను లీజుకు తీసుకునేందుకు ప్రయత్నించారు. తమకు అధ్యక్షుడి మద్దతు ఉందని  బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆర్స్‌తో ఫోటోలు వారు చూపించారు.                                   

 స్థానిక తెగ ప్రతినిధి 2 లక్షల డాలర్లు చెల్లిస్తే ఢిల్లీకి దాదాపు మూడు రెట్ల విస్తీర్ణంలో ఉన్న భూమిని 25 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వడానికి దాదాపుగా ఒప్పందం కూడా చేసుకున్నారు.  అయితే కైలాస ప్రతినిధులు ఆ భూమిని వెయ్యి సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని, గగనతల వినియోగం , సహజ వనరుల తవ్వకాలకు కూడా అనుమతి ఇవ్వాలని షరతులు పెట్టారు. ఆ నోటా.. ఈ నోటా పడి ఈ వ్యవహారం మీడియాకు చేరింది.  వెంటనే  బొలివీయా  ప్రభుత్వం విచారణ చేపట్టింది.  నిత్యానందకు సంబంధించిన  20 మందిని అరెస్టు చేసి, స్థానికులతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసింది. నిందితులు పర్యాటకులుగా బొలీవియాలోకి ప్రవేశించి స్థానికులతో ఒప్పందాలు చేసుకున్నారని ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. వారిని దేశం బయటకు గెంటేశారు. 

లైంగిక వేధింపుల కేసుల్లో  ఇరుక్కున్న నిత్యానంద దేశం విడిచి పారిపోయారు.  'కైలాస' దేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా ప్రకటించారు. అది ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు.  ఈక్వెడార్ సమీపంలో ఒక చిన్న దీవిని కొనుగోలు చేసి దానికి కైలాసం అని పేరు పెట్టినట్లు గతంలో నిత్యానంద ప్రకటించాడు. ఒక కేసు విషయమై తమిళనాడు ప్రభుత్వం కూడా నిత్యానంద ఈక్వెడార్‌లో ఉన్నట్లు హైకోర్టుకు తెలిపింది. ఆ దీవిలో ఉండలేక బొలివియాకు మకాం మార్చేందుకు.. నిత్యానంద ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.