BJP On Indian Currency:


ట్విటర్‌లో షేర్ చేసిన నేత..


కరెన్సీ నోట్ల వివాదానికి ఇప్పట్లో తెరపడేలా లేదు. ఆప్, కాంగ్రెస్, భాజపా మధ్య ఇది మాటల యుద్ధానికి దారి తీసింది. ఒక్కో పార్టీ ఒక్కో విధంగా కేజ్రీవాల్ కామెంట్స్‌పై స్పందిస్తోంది. ఓ భాజపా నేత మాటలు ఎందుకనుకున్నాడో ఏమో. ఏకంగా చేతల్లో చూపించాడు. ఛత్రపతి శివాజీ ఫోటోతో ఇండియన్ కరెన్సీని ఫోటోషాప్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. భాజపా నేత నితేశ్ రాణే ఈ ఫోటోను షేర్ చేశారు. రూ.200 నోటుపై ఛత్రపతి శివాజీ ఫోటోని ఎడిట్ చేశారు. మహారాష్ట్రలోని కంకవలి ఎమ్మెల్యే అయిన రాణే.."ఇది పర్‌ఫెక్ట్‌"
అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కేజ్రీవాల్‌ కామెంట్ చేసినప్పటి నుంచి కరెన్సీ నోట్లపై ఫోటోల విషయంలో పెద్ద వివాదం నడుస్తోంది. కేజ్రీవాల్‌కు ఉన్నట్టుండి హిందూ రాజకీయాలు గుర్తొచ్చాయని భాజపా విమర్శిస్తోంది. ఇదంతా పొలిటికల్ డ్రామా అని కొట్టి పారేస్తోంది. హిందూ దేవుళ్లను ఆప్ ఎన్నో సార్లు కించపరిచిందని, ఇప్పుడు కొత్తగా ఈ నాటకం తెరపైకి తీసుకొచ్చిందని భాజపా నేత మనోజ్ తివారి మండిపడ్డారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన ఆప్...ఇప్పుడు హిందూ కార్డ్‌ పట్టుకుని రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 






అంబేడ్కర్ బొమ్మ ఉండాలంటూ డిమాండ్..


 కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారి దీనిపై స్పందించారు. ట్విటర్ వేదికగా తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. గాంధీ బొమ్మ పక్కన అంబేడ్కర్ బొమ్మ ఎందుకు లేదని ప్రశ్నించారు. అహింస, రాజ్యాంగవాదం, సమతావాదం అనే అంశాలు మనలోని ఐక్యతను ప్రతిబింబిస్తాయి. ఆధునిక భారత్‌కు ఇదే సరైన ప్రతీక అని అన్నారు తివారి. ఇక భాజపా అయితే...కేజ్రీవాల్‌పై తీవ్రంగా ఫైర్ అవుతోంది. గుజరాత్ ఎన్నికల కోసమే ఆయన "హిందూ కార్డ్‌" రాజకీయాలు చేస్తున్నారని మండి పడుతోంది. నిజానికి...ఇలా కరెన్సీ నోట్లపై బొమ్మలు మార్చేయాలన్న డిమాండ్ గతంలోనూ వినిపించింది. గత వారం Akhil Bharat Hindu Mahasabha (ABHM) కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బొమ్మను కరెన్సీ నోట్లపై ముద్రించాలని చెప్పింది. అంతే కాదు. రబీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, ఏపీజే అబ్దుల్ కలామ్ బొమ్మలు ముద్రించాలని చాలా మంది డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ల నేపథ్యంలో RBI స్పందించింది. కరెన్సీ నోట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని తేల్చి చెప్పింది. అయినా...ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. 


కేజ్రీవాల్ కామెంట్స్..


ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కరెన్సీ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మన ఇండియన్ కరెన్సీపై లక్ష్మీ దేవి, గణపతి బొమ్మలు ముద్రించాలని ప్రధాని మోదీకి సూచించారు. లక్ష్మీ దేవి, గణేషుడి బొమ్మలు మన కరెన్సీపై ఉంటే దేశం ఇంకా సంపన్నమవుతుందని అన్నారు. మహాత్మా గాంధీ బొమ్మ పక్కనే లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలూ ముద్రించాలని సూచించారు. "ఇండోనేషియా కరెన్సీ నోట్లపై గణేషుడి బొమ్మ ఉన్నప్పుడు మన కరెన్సీపై ఉంటే తప్పేంటి. ఈ విషయమై కేంద్రానికి రెండ్రోజుల్లో లేఖ రాస్తాను. ప్రస్తుత మన దేశ ఆర్థిక వ్యవస్థ చక్కబడాలంటే ఆ దేవతల ఆశీర్వాదం కూడా అవసరమే" అని వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్. 


Also Read: Priyanka Gandhi's Insta Post: 'ఇదంతా కేవలం ప్రేమ కోసమే చేశావ్‌'- ప్రియాంక గాంధీ ఎమోషనల్ పోస్ట్