Shivaji Remarks Row:


బహుశా ఆయనను మార్చేస్తారేమో-బీజేపీ ఎంపీ 


ఛత్రపతి శివాజీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొషియారిని ఢిల్లీ పెద్దలు పిలిచినట్టు తెలుస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలు వేడెక్కించిన నేపథ్యంలో...బీజేపీ అధిష్ఠానం సీరియస్ అయినట్టు సమాచారం. అందుకే...ఢిల్లీకి పిలిచి మరీ మందలిస్తారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. బీజేపీ ఎంపీ ఛత్రపతి  ఉదయన్‌రాజే భోసలే దీనిపై స్పందించారు. "మహారాష్ట్ర గవర్నర్ రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉంటారు. ఆయన స్థానంలో మరో వ్యక్తిని గవర్నర్‌గా పెడతారని అనుకుంటున్నారు. కచ్చితంగా ఆయనను తొలగించాల్సిందే. ప్రజల్లో లేనిపోని అలజడి సృష్టిస్తున్నారు. సరైన పరిష్కారం చూపించేంత వరకూ ఇలాంటి వివాదాలు ఆగవు" అని అభిప్రాయపడ్డారు. శివాజీ వంశస్థుడైన భోసలే...ఈ వివాదంపై ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీతో సహా బీజేపీ పెద్దలందరికీ లేఖ రాశారు. కొషియారిని గవర్నర్ పదవి నుంచి తొలగించాలని ఆ లేఖలో కోరారు. "ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయనను తొలగించేందుకు అన్ని అవకాశాలనూ పరిశీలించండి. ప్రస్తుత వివాదానికి మీరు చూపించే పరిష్కారం మహారాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది" అని విన్నవించారు. భగత్ సింగ్ కొషియారి గతంలోనూ మహాత్మా జ్యోతిబాఫూలేపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు. 






తీవ్ర విమర్శలు..


శిందే వర్గంలోని ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ స్పందించారు. "గవర్నర్ భగవత్ సింగ్ కొషియారిని రాష్ట్రం నుంచి ఎక్కడికైనా దూరంగా పంపేయాల్సిందే" అని డిమాండ్ చేశారు.  మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీపై అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై మండి పడ్డారు. గతంలోనూ ఇలాంటి కామెంట్స్ చేసి విమర్శల పాలయ్యారని గుర్తు చేశారు. "ఛత్రపజి శివాజీ సిద్ధాంతాల్ని గవర్నర్ అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో మరే వ్యక్తితోనూ ఆయనను పోల్చలేం. కేంద్రంలోని బీజేపీ నేతలకు నాదో విన్నపం. రాష్ట్ర చరిత్ర గురించి తెలియని ఇలాంటి వ్యక్తిని వేరే ఎక్కడికైనా పంపడం మంచిది" అని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల గురించి, ప్రజల సెంటిమెంట్‌ల గురించి తెలియని వ్యక్తి గవర్నర్ పదవిలో ఎలా ఉంటారని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. ఛత్రపతి శివాజీ ఐకానిక్ పర్సనాలిటీ అయినా అదంతా పాత రోజుల్లోనని...
ఇప్పటి ఐకానిక్ పర్సనాలిటీస్ బీఆర్ అంబేడ్కర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అని ఆయన చేసిన కామెంట్స్‌తో పెద్ద దుమారం రేగింది. నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP)తో పాటు ఠాక్రే నేతృత్వంలోని శివసేన విమర్శలు ధాటిని పెంచింది. "ఇది ఛత్రపతి శివాజీకి తీరని అవమానం" అని విమర్శిస్తున్నాయి.


Also Read: Amit Shah On UCC: అందరితో చర్చించాకే అమలు చేస్తాం, యూనిఫామ్ సివిల్ కోడ్‌పై అమిత్ షా క్లారిటీ