Bharat Jodo Nyay Yatra Ends: భారత్‌ జోడో న్యాయ్ యాత్రని (Bharat Jodo Nyay Yatra) ముంబయిలో ముగించారు రాహుల్ గాంధీ. మణిపూర్‌లో ప్రారంభమైన ఈ యాత్ర 63 రోజుల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా ముంబయిలో భారీ ర్యాలీ నిర్వహించింది కాంగ్రెస్. ఈ ర్యాలీలోనే రాహుల్ గాంధీ (Rahul Gandhi) మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చేయాలంటూ ఇటీవల కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. బీజేపీ పదేపదే రాజ్యాంగంలో మార్పుల గురించి మాట్లాడడం తప్ప అందులో మార్పులు చేసే ధైర్యం ఆ పార్టీకి లేదని అన్నారు. రాజ్యాంగంలోని నిజాల్ని మార్చే ధైర్యం ఆ పార్టీకు ఎప్పటికీ రాదని తేల్చి చెప్పారు. భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ తమకు అనుకూలంగా రాయించుకుందని బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు ఇలా కౌంటర్ ఇచ్చారు రాహుల్. అయితే...ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిగతం అని, పార్టీతో సంబంధం లేదని బీజేపీ చెప్పినప్పటికీ వివాదాస్పదమయ్యాయి. ముంబయిలోని మహాత్మా గాంధీ ఇంటి వద్ద న్యాయ్ సంకల్ప్ పాదయాత్ర నిర్వహించిన సమయంలో రాహుల్ ఈ విమర్శలు చేశారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో 1942లో మహాత్మా గాంధీ ఇక్కడి నుంచే క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. 


"రాజ్యాంగం గురించి బీజేపీ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతుంది. కానీ అందులో మార్పులు చేసే ధైర్యం మాత్రం ఆ పార్టీకి లేదు. ప్రజలు మా వైపే ఉన్నారు. నిజం కూడా మా వైపే ఉంది. కేవలం ఒకే వ్యక్తి కేంద్రంగా దేశాన్ని నడిపించాలని చూస్తున్నారు. ప్రభుత్వం ప్రజల అభిప్రాయాల్ని గౌరవించాలి. వాళ్ల కష్టాలేంటో వినాలి"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత 


దేశవ్యాప్తంగా విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ పని అంటూ మండి పడ్డారు రాహుల్ గాంధీ. పేదలు, రైతులు, వెకనబడిన వర్గాలకు న్యాయం చేయడం లేదని విమర్శించారు. ఇన్ని కోట్ల మందిలో సరిగ్గా న్యాయం జరిగేది 5% మంది ప్రజలకే అని అసహనం వ్యక్తం చేశారు. కోర్టులు సహా మిగతా సంస్థలన్నీ కేవలం తమ కోసమే పని చేయాలని బీజేపీ భావిస్తోందని ఫైర్ అయ్యారు. 


"ఈ దేశంలో 5% మందికే సరైన న్యాయం జరుగుతోంది మిగతా వాళ్లంతా న్యాయం కోసం పడిగాపులు కాస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఈ దేశంలోని కోర్టులు సహా ఇతరా సంస్థలన్నీ తమ కోసమే పని చేయాలని చూస్తోంది. దాదాపు 90% మంది ప్రజలు అన్యాయమైపోతున్నారు. అనవసరంగా విద్వేషాలు ప్రచారం చేస్తున్నారు. పేదలు, రైతులు, మహిళలు, యువత..ఇలా ఎవరిని చూసినా న్యాయం సరైన న్యాయం జరగడం లేదు"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత