BJP Protest In Jaipur:



నిరనసలు..


పుల్వామా దాడిలో అమరులైన సైనికుల కుటుంబ సభ్యులు నిరసన బాట పట్టారు. కుటుంబంలో ఎవరో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని జవాన్ల భార్యలు డిమాండ్ చేశారు. దీంతో పాటు మరి కొన్ని సమస్యలూ తీర్చాలని ఆందోళన చేపట్టారు. వీరికి బీజేపీ నేత కిరోడి లాల్ మీనా కూడా మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారంటూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ మండి పడ్డారు. అటు లాల్ మీనా మాత్రం పోలీసులు తనను చంపాలని చూశారని తీవ్ర ఆరోపణలు చేశారు. 


"నన్ను పోలీసులు చంపాలని చూశారు. కానీ ధైర్యవంతులైన ఆ మహిళల దయ వల్ల బతికి బయటపడ్డాను. నిరసనల్లో పాల్గొన్న నిరుద్యోగులు, పేదలే నా ప్రాణాలు కాపాడారు. నాకు తీవ్ర గాయాలయ్యాయి. జైపూర్‌లోని ఓ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్తున్నాను"


- కిరోడి లాల్ మీనా, బీజేపీ నేత






సచిన్ పైలట్ నివాసం ఎదుట ఆందోళన..


లాల్ మీనాతో పాటు ఆందోళనలో పాల్గొన్న జవాన్ల కుటుంబ సభ్యులనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సచిన్ పైలట్ నివాసం ఎదురుగా నిరసనలు చేస్తుండగా..వారిని అక్కడి నుంచి క్రమంగా వారిని ఆసుపత్రులకు తరలించారు. దీనిపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కించపరిచిందని మండి పడింది. లాల్ మీనా కూడా వరుస ట్వీట్‌లతో రాజస్థాన్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. నిరసనకారులకు మద్దతుగా నిలబడినందుకు తనను వేధించారని, ప్రజా ప్రతినిధితో వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. ఫిబ్రవరి 28 నుంచి ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిబంధనల్లో మార్పులు చేసి కేవలం తమ పిల్లలకే కాకుండా తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు. తమతమ గ్రామాల్లో అమర జవాన్ల విగ్రహాలు పెట్టడంతో పాటు రోడ్లు కూడా నిర్మించాలని అడుగుతున్నారు. అయితే దీనిపై అశోక్ గహ్లోట్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. జవాన్ల పిల్లలకు చెందాల్సిన ఉద్యోగాలను, వేరే వారికి ఇవ్వాలనడం ఎంత వరకూ సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ నిరసనల్లో పాల్గొన్న మహిళలను పోలీసులు అరెస్ట్ చేయడంపై కేంద్ర మహిళా కమిషన్ మండి పడింది. ప్రస్తుతానికి ఈ డిమాండ్‌లను పరిశీలిస్తున్నామని గహ్లోట్ చెబుతున్నారు.